* ఇప్పటికే 20 శాతం మద్యం దుకాణాల తొలగింపు
* సమీక్షా సమావేశంలో సిఎం జగన్మోహన్రెడ్డి
* స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాల సమయం కుదింపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
రాష్ట్రంలో ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం కుదించాలని, స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాల సమయాన్ని తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేయనున్నామని తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానాతో పాటు జైలుశిక్ష విధించేలా ఇప్పుడున్న చట్టంలో మార్పు చేయాలని సూచించారు. మంగళవారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో మద్యం పాలసీపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్‌లో అమలు చేయబోయే కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. వివరాలను ఉపముఖ్యమంత్రి, ఎక్పైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 38 స్టార్ హోటళ్లు, నాలుగు పబ్‌లు సహా మొత్తం 839 బార్లు ఉన్నాయని తెలిపారు. స్టార్ హోటళ్లు, పబ్‌లు మినహాయిస్తే 797 చోట్ల బార్లు ఉన్నాయని అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో సగానికిపైగా బార్లు తగ్గించాలని సిఎం ఆదేశించారు. ఇప్పటికే వైన్‌షాపులు 20 శాతం కుదించామని అధికారులు చెప్పగా మద్య నిషేధంలో భాగంగా దశలవారీగా కుదించాలని సిఎం వారికి సూచిం చారు. చివరకు 797 బార్లలో 40 శాతం కుదించాలని నిర్ణయించారు. వాటికి కొత్తగా లైసెన్సులు జారీచేయడంతో పాటు లాటరీ పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించారు. మద్యం పట్టుకుంటే షాక్ కొడుతుందనే భావన ఉండాలని, అప్పుడే దానికి చాలామంది దూరం అవుతారని చెప్పారు. ఈ మేరకు దరఖాస్తు, లైసెన్స్ ఫీజులూ ఉండాలని తెలిపారు. మద్య నిషేధం దిశగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సిఎం సూచించారు. బార్లలో ఉదయం 11 గంటల నుండి రాత్రి పదిగంటల వరకూ మద్యాన్ని, 11 గంటల వరకూ ఆహారాన్ని అనుమతిస్తామని తెలిపారు. స్టార్ హోటళ్లలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకూ మద్యాన్ని విక్రయించడానికి అనుమతి ఉందని అధికారులు తెలిపారు. బార్లలో అమ్మే మద్యం ధరలు పెంచాలని నిర్ణయించారు.
నాటు సారా తయారు చేసినా, మద్యాన్ని స్మగ్లింగ్, కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని, దీనికోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడున్న మద్యం చట్టానికి సవరణలు తీసుకురావాలని సూచించారు. బార్ యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ ఫీజుకు ఐదురెట్లు జరిమానా కట్టాలన్నారు.
ఇసుకపైనా చట్ట సవరణ
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండు లక్షల జరిమానాతోపాటు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడే విధంగా చట్టంలో మార్పులు చేయాలని సిఎం సూచించారు. ఈ సమావేశాల్లో రెండు బిల్లులనూ పెట్టాలని అధికారులకు సిఎం సూచించారు. ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్ద కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.