* వైసిపి పార్లమెంట్ పార్టీ భేటీ నిర్ణయం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:
లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టుపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైసిపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత పివి మిథున్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నాడిక్కడ వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి నివాసంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. విజయసాయి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం పి.వి మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, . రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్రానికి రావల్సిన నిధులపై చర్చించామన్నారు. ఆయా అంశాలను ఏవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే దానిపై ఎంపిలు చర్చించినట్లు చెప్పారు. పోలవరంపై సావధాన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. పోలవరంపై చర్చ వచ్చే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు. ప్రతిదానికి గొడవ చేయడం కాకుండా, అవసరమైన వాటిపై గట్టిగా పట్టుబడతామని తెలిపారు. ఇటీవలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసిన తరువాత పోలవరానికి కొన్ని నిధులు విడుదల అయ్యాయని, మిగిలిన నిధులపై కూడా కేంద్రం సానుకూలంగానే ఉందని చెప్పారు. అన్ని విషయంల్లో ఫలితం సాధించలేకపోయినప్పటికీ, మెజార్టీ అంశాల్లో ఫలితం సాధిస్తున్నామని అన్నారు. వైసిపి ఎంపి వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని అన్నారు. కేంద్ర మంత్రులను కలిసినప్పుడు సిఎం వారి దృష్టికి తీసుకెళ్లిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. తమిళనాడుకు మంజూరుచేసిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాల్సి ఉందని తెలిపారు. ఈ సమావేశాల్లో 27 బిల్లులు చర్చకు వస్తాయని, వాటిపై చర్చల్లో ఎవరెవరూ పాల్గొనాలనే అంశంపై చర్చించామని తెలిపారు.
పోలవరంపై సావధాన తీర్మానం
