* అంగన్వాడీ జాతీయ సభలో పలువురు సౌహార్ధ్ర సందేశాలు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం(భీమవరంప్రతినిధి):
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న అల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ 9వ మహాసభ మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ మహాసభలకు వివిధ ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపి సౌహార్ధ్ర సందేశాలు ఇచ్చారు.
స్కీమ్ వర్కర్‌గా ఉన్న అంగన్వాడీ, ఆశ, మిడ్డే మిల్స్, ఇతర రంగాలను ప్రయివేట్ వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మధ్యాహ్న భోజన పథకం యూనియన్ అఖిల భారత కార్యదర్శి జై భగవాన్ అన్నారు. అంగన్వాడీ జాతీయ మహాసభలో మంగళవారం ఆయన సౌహార్థ్ర సందేశమిచ్చారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీసం వేతనాలు అమలు చేయడంలేదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. కనీస వేతనం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని తెలి పారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛను అమలు జరిగేలా పోరాటాలు నిర్వహించాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల పోరాటాలకు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు.
- జై.భగవాన్, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ అఖిల భారత కార్యదర్శి
అంగన్వాడీ సేవలు మరువలేనివి
గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ ఉద్యోగుల సేవలు మరువలేనివని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామాల్లో వ్యవసాయ కార్మిక కుటుంబాలకు సేవలు చేయడంలో, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్మిక గర్భిణి మహిళలకు సేవ చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహార లోపం, ఆకలి సూచికలో ప్రపంచంలోని 117 దేశాల్లో మనస్థానం 102కి చేరిందన్నారు. .
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు