* చిచ్చుపెడుతున్న రాజకీయ నాయకులకే వ్యతిరేకం
* ఎన్ని అడ్డంకులున్నా సమర్థవంతంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ
* 'ప్రజాశక్తి'తో కాశ్మీర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లతీఫా గనాయ్
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
కాశ్మీర్ ప్రజలను చీల్చడానికి, వారిని దేశ వ్యతిరేకులుగా చిత్రించడానికి ప్రయత్నిస్తోన్న రాజకీయ నాయకులకే కాశ్మీరీయులు వ్యతిరేకమని, కాశ్మీర్ ప్రజలు దేశానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని అంగన్వాడీ యూనియన్ కాశ్మీర్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లతీఫా గనాయ్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రివర్‌బే ఆహ్వానం హాలులో జరుగుతున్న అంగన్వాడీ అఖిల భారత మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె సోమవారం 'ప్రజాశక్తి'తో మాట్లాడారు. ప్రస్తుతం కాశ్మీర్ ఓపెన్ జైలులా ఉందన్నారు. నలుగురు కలిసి మాట్లాడుకునే పరిస్థితి లేదని చెప్పారు. కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలోనూ, సిటీలోనూ ఎన్ని అననుకూల పరిస్థితులున్నప్పటికీ అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు తమ కేంద్రాల నిర్వహణలోనూ, తల్లీబిడ్డల సంరక్షణలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అనంతనాగ్ సిటీలో రెండు వేల మంది అంగన్వాడీలు ఉన్నారని చెప్పారు. అనంతనాగ్ నుంచి తానే హాజరయ్యానని తెలిపారు. తనతోపాటు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నజార్ వచ్చారని చెప్పారు. కాశ్మీర్లో 30 వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మంచు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇబ్బందుల మధ్య అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు వస్తున్నారన్నారు. మైనస్ డిగ్రీ చలి ఉన్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్తుతో వేడి నీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీంతో, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాశ్మీర్ ప్రజలు తమ సంపదలో మాతా శిశు సంక్షేమానికి ఎక్కువ ధనం ఖర్చు చేయడం వల్ల ఇక్కడ మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు. ప్రభుత్వం అందించే సహకారంతో పాటు ప్రజలు కూడా చిన్నారుల ఆరోగ్య రక్షణకు తమ సంపాదనను వెచ్చిస్తారని తెలిపారు. 'అనేక మందికి భూమి ఉంది. చాలామంది చిరు వ్యాపారాలు చేస్తున్నారు. విద్యత్తులేమి, అధిక మంచుతో ఇబ్బందులు ఉన్నాయి. అయినా, ప్రజలు చైతన్యవంతులై మాతా శిశు సంరక్షణలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు' అని చెప్పారు.
కాశ్మీర్ గురించి ఆమె మాటల్లో... 'జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ నిర్బంధాలు, అణచివేత కొనసాగుతున్నాయి. ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత నెల రోజులపాటు పాఠశాలలు, ఆస్పత్రులు, బస్సులు బంద్ అయ్యాయి. నలుగురు కలుసుకుని మాట్లాడుకునే పరిస్థితి లేదు. కాశ్మీర్ ఓపెన్ జైలుగా మారింది. 40 రోజులపాటు బ్యాంకులు, ఎటిఎంలు పనిచేయలేదు. అంబులెన్సులు లేవు. విద్యుత్తు లేదు. మందులూ లేవు. ఇలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రజలు తీవ్ర నిర్బంధానికి గురయ్యారు. శత్రువులపై ప్రయోగించాల్సిన మిలటరీని కాశ్మీర్ ప్రజలపై ప్రయోగించారు. వంద రోజులుగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. దేశానికి కాశ్మీర్‌కు మధ్య పాలకులు అగాధం సృష్టిస్తున్నారు. కాశ్మీర్ భారత్‌లో ఒక భాగం. ప్రసుతం భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వం పరిశ్రమలు పెట్టడంలేదు. చిరు వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోంది. 1947కు ముందు కూడా కాశ్మీర్ భారత్‌తో కలిసే ఉంది. స్వాతంత్య్రం తర్వాత కూడా భారత్‌లోనే కొనసాగింది. భారత్‌లో అంతర్ భాగంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌ను, అక్కడ ప్రజలను విదేశీయులుగా చూడటం సరికాదు. దేశం నుంచి కాశ్మీర్ ప్రజలను వేరుచేసే కుట్ర చేస్తున్న రాజకీయ నాయకులను మాత్రమే కాశ్మీరీలు వ్యతిరేకిస్తున్నారు. దేశాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కాశ్మీర్ ప్రజల్లో పాలకులు విశ్వాశాన్ని నింపాలి. వారి మనోభావాలను అర్థం చేసుకోవాలి.'
కాశ్మీరీ ప్రజలు దేశానికి వ్యతిరేకం కాదు
