* విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ఆంగ్ల మాధ్యమానికి మతానికి ముడిపెట్టి విశ్లేషణ చేయడం దారుణమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై బురదజల్లే కుట్ర జరుగుతోందన్నారు. సచివాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమాy ేశంలో మంత్రి మాట్లాడారు. ఆంగ్ల మాధ్యమంపై ఓ పత్రిక విషం చిమ్ముతోందని విమర్శించారు. మత మార్పిడి చేయాలని చూస్తున్నారని ఆ పత్రికలో విశ్లేషించారని, ఇంతకన్నా దుర్మార్గమైన రాతలు ఉంటాయా అని ప్రశ్నించారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం పొంది ఏటా రెండు లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని, వీరిని కూడా మతం కోణంలో చూస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండటంతో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. నిన్నటి వరకు ఇసుక అంటూ దుమ్మెత్తిపోశారని, ఇప్పుడు ఆంగ్లం అంటూ గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు. ఆంగ్లంకు మతానికి ముడిపెట్టి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో కుమ్మక్కై అసత్యప్రచారం : ఎమ్మెల్యే సుధాకర్ బాబు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై ఓ పత్రిక అధినేత అసత్య ప్రచారం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ వ్యవస్థలతో కుమ్మక్కై ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. నారాయణ, చైతన్య స్కూల్స్‌ను కాపాడుకోవడం కోసమే తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.