- రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక నాయకులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
వెనుకబాటుకు గురైన రాయలసీమ ప్రాంతానికి నికర జాలాలు కేటాయించి, సాగుకు అనువుగా నీటి నిల్వ కాలువలు ఏర్పాటు చేసినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక నాయకులు, పలువురు మేధావులు అన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక దినోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక టవర్‌క్లాక్ సమీపంలో ఉన్న పాత ఆర్డీవో కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రామ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన దీక్షకు రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర కన్వీనర్ దశరథరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, కడప జిల్లా నాయకులు, జర్నలిస్ట్ నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు, ఎఐకెఎంఎస్ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటనరసయ్య, మానవహక్కుల వేదిక నాయకులు చంద్రశేఖర్, పౌర హక్కుల సంఘం నాయకులు శేషయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాడు శ్రీబాగ్ ఒప్పందం చేసి రాయలసీమ నుంచి రాజధాని తరలించారని తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత కూడా రాయలసీమకు న్యాయం జరగడం లేదన్నారు. రాజధాని లేక హైకోర్టు ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కానీ పాలకులు కోస్తాంధ్రలో ఎమ్మెల్యే సీట్లు అధికంగా ఉన్నాయని, ఓటు రాజకీయాలు చేస్తూ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జిల్లాల నుంచి ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నికర జాలలతోనే సీమ అభివృద్ధి
