- జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రశ్న
- మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరం ప్రారంభం
ప్రజాశకి-మంగళగిరి (గుంటూరు జిల్లా)
వైసిపి నేతలకు ఆకలి బాధ తెలుసా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణమండపం వద్ద జనసేన ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరా లేకపోవడంతో పనులు లేక కుటుంబం గడవక 50 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన చెప్పారు. వారికోసమే ఆహారశిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు జనసేన అండగా ఉందని చెప్పడానికే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వారికి భోజనాలు పెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని పనులు ఆపడం కార్మికులకు శాపంగా మారిందన్నారు. అమరావతిలో నిర్మాణాలు మొదలుపెడితేను ఇక్కడి కార్మికులు బతుకుతారని చెప్పారు. ప్రజామోదంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని విమర్శించడం తనకు సరదా కాదని, గొప్ప పాలన అందిస్తే చప్పట్లు కొడతానని పవన్ అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తీసుకుని రాజకీయాలు చేయడానికి రాలేదని, సిద్ధాంతాలు నచ్చినవారినే తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సంక్షేమ నిధికి మంగళగిరి పట్టణానికి చెందిన ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగులు రూ.2 లక్షల చెక్కును పవన్‌కల్యాణ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.ఖాన్, రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, పిఎసి సభ్యులు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, నాయకులు శ్రీనివాసరావు, తిరుపతిరావు, సిపిఐ రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వారికి ఆకలి బాధలు తెలుసా?
