ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
దళితులను దూషించడం ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా టిడిపి నేతలకు కొత్తేమి కాదని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్రకుల దురహంకారంతోనే వారు దూషణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దళితులుగా పుట్టాలని కోరుకుంటారాని, దళితులను గొప్పవాళ్లనుకోవడం లేదని చంద్రబాబు, దళితులు శుభ్రంగా ఉండరని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గతంలో కించపరిచేలా మాట్లాడారని అన్నారు. ఇటీవలె ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టిడిపి నేతలు దూషించి కంటతడి పెట్టించారన్నారు. తాను కూడా ఒక మహిళననే విషయాన్ని మరిచిపోయి మహిళా ఎస్సైని కులం పేరుతో నన్నపనేని రాజకుమారి అవమాన పరిచారని అన్నారు. దళితుల వల్లే ఈ దరిద్రమని నన్నపనేని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకే టిడిపిని అధికారం నుంచి దించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చంద్రబాబుతో సహా టిడిపి నేతలందరూ దళితులకు క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
దళితులను దూషించడం టిడిపికి కొత్తేమీ కాదు : పుష్పశ్రీవాణి
