- నాలుగు కోట్ల నిధులు స్వాహా
- అడ్వైజరీ కమిటీ చైర్మన్ రాజీనామా
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఢిల్లీ శ్రీవారి ఆలయంలో నిధుల గోల్మాల్ విషయమై తిరుపతి జెఇఒ బసంత్‌కుమార్ విచారణ చేపట్టారు. లోతైన విచారణ కోసం కేసును విజిలెన్స్‌కు అప్పగించారు. పూజా సామాగ్రి పేరుతో నాలుగు కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ నిగ్గు తేల్చింది. దీంతో మరింత సుదీర్ఘంగా విచారణ చేపట్టాలని టిటిడి భావించిన నేపథ్యంలో ఢిల్లీ శ్రీవారి ఆలయం లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని శనివారం ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు పంపించారు. రూ.70 కోట్లు దుర్వినియోగం అయినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. ఏపి భవన్లో కూడా నిధులు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై లీగల్ సెల్ ప్రత్యేక అధికారి సర్ల దేవితో కమిటీ కూడా వేశారు. విచారణ నిమిత్తం అకౌంట్స్‌కు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎస్సై తీసుకెళ్లారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఢిల్లీలో శ్రీవారి ఆలయం ఉంది. చెన్నరు, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ప్రచార కేంద్రాలున్నాయి. అన్నింటిలోనూ లోకల్ అడ్వైజరీ కమిటీలు ఉండడంతో అవినీతికి దారితీస్తున్నాయని టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ వాటిని రద్దు చేశారు. అయితే ఢిల్లీది మాత్రం రద్దుచేయకుండా వదిలేశారు. దీంతో గత రెండు సంవత్స రాలుగా ఆలయ అభివృద్ధి కోసం టిటిడిలో నిధులను కేటాయిస్తూ వచ్చారు. అయితే వాటికి సంబంధించిన ఆడిట్‌ను దేవస్థానం చేపట్టాల్సి ఉంది. శ్రీవారి కళ్యాణం, పసుపు- కుంకుమ, పూజాసామగ్రి ఇతరత్రా కైంకర్యాలకు నాలుగు కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అలాగే ఏసీ, కరెంట్ ఛార్జీల పేరిట మరో ఐదు లక్షల రూపాయలను చూపించారు. వీటన్నింటిపైనా టిటిడి ఆడిట్ కాకుండా, అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ 'లోకల్' ఆడిట్ జరిపించి మమ అనిపించినట్లు తెలిసింది. అయితే కొంతమంది రహస్యంగా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను టిటిడికి చేరవేశారు. టిటిడి పర్యవేక్షణపైన ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తిరుపతికి చెందిన మాజీ కౌన్సిలర్ నవీన్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు అక్కడ జరుగుతున్న అవినీతిని వారం రోజుల క్రితం మీడియా ఎదుట బహిరంగపరిచారు. దీంతో తిరుపతి జెఇఒ బసంత్‌కుమార్ వెంటనే స్పందిస్తూ ఢిల్లీకి వెళ్లడం, విజిలెన్స్‌ను విచారణకు ఆదేశించడం, నాలుగు కోట్లకుంభకోణం వాస్తవమేనని తేలిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీ 'శ్రీవారి' ఆలయంలో గోల్మాల్
