ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో:
రాజధాని నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించారు. రాజధానిలో చోటుచేసుకున్న వరదల నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని అలోచిస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా.. దాని గురించే ప్రస్తుతం చర్చిస్తున్నామని చెప్పారు. బురద నేల కావడంతో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని తెలిపారు. ప్రస్తుత రాజధాని ప్రాంతం సురక్షితం కాదని శివరామకృష్ణ కమిటీ ఎప్పుడో చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మామూలుగా ఎక్కడైనా నిర్మాణాలు జరిగితే రూ.వెయ్యో, లక్షో ఖర్చయితే, ఇక్కడ మాత్రం రూ.రెండు లక్షలు ఖర్చవుతుందని, దీంతో ప్రజాధనం దుర్వినియోగమవుతుందని తెలిపారు. ఇటీవల సంభవించిన వరదలతో రాజధానిలో ముంపు ప్రాంతాలున్నాయని గుర్తించామని, దీనికోసం ప్రత్యేకంగా కాల్వలు, డ్యాములు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.
త్వరలో నిర్ణయం : బొత్స
