ప్రజాశక్తి - గురజాల
పొలంలో గడ్డికోస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ రైతు మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా గురజాల మండలంలోని అంజనాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మాడుగుల శివారు గ్రామమైన అంజనాపురానికి చెందిన పేరం పెదవీరారెడ్డి (39) వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన పొలానికి వెళ్లిన వీరారెడ్డి పక్కనే ఉన్న కాల్వలో గడ్డిని కోసుకునే క్రమంలో అక్కడున్న నీటి మోటారు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటికి సమీప పొలాలకు వచ్చిన రైతులు మృతుడు పెదావీరారెడ్డిని గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతినికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
