- పంచాయతీ కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం
- ఆర్థిక ఇబ్బందుల్లో కార్మిక కుటుంబాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ఒక్కనెల జీతం ఆలస్యమైతే ప్రభుత్వ ఉద్యోగులు విలవిల్లాడిపోతారు. అలాంటిది ఒక కార్మికునికి ఆరు నెలలు జీతం అందకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు పంచాయతీ పారిశుధ్య కార్మికులు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు నెలలుగా జీతాలందక పంచాయతీ పారిశుధ్యకార్మికులు తీవ్ర ఇబ్బందులెదు ర్కొంటున్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కదా, జీతం ఎంతయితే ఏమిలే అనుకుని స్వచ్ఛభారత్-స్వచ్ఛసర్వేక్షణ్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 32,500 మంది పారిశుధ్య కార్మికులు పంచాయతీల్లో రూ.6వేల జీతానికి పనిచేస్తున్నారు. మొదట్లో రెండు నెలలు వరుసగా జీతాలిచ్చి మురిపించిన ప్రభుత్వం, ఆ తర్వాత ఇప్పటి వరకు జీతాలివ్వలేదు. దీంతో కుటుంబపోషణ కోసం కార్మికులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. జీతాలిప్పించడంలో చొరవ చూపని అధికారులు, పని చేయించుకోవడంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడడం లేదు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా ఖచ్ఛితంగా పనికి రావాల్సిందేనని ఆంక్షలు విధించి మరీ పనులు చేయించుకుంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం నిధులు మంజూరు చేశామని చెబుతోంది. మరోవైపు జీతాలివ్వడానికి నిధుల్లేవని అధికారులు దీమాగా సమాధానం చెబుతున్నారు జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే పంచాయతీ కార్మికులకు జీతాలందడంలేదనే వాదనలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ సమయంలో నిలిచిపోయిన జీతాలు, నేటికీ విడుదల కాకపోవడంతో కార్మికులు అప్పుులు చేసి బతకాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అప్పుు దొరక్క కుటుంబాన్ని పోషించడంలో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయినా వీరి కష్టాలు ఏ అధికారికీ పట్టకపోవడం శోచనీయం.
నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డుల జాడ లేదు
స్వచ్ఛభారత్-స్వచ్ఛసర్వేక్షణ్ పథకంలో భాగంగా నియమితులైన 32,500 మంది కార్మికులకు ఇప్పటివరకు నియామక ఉత్తర్వులే అందలేదు. అదే విధంగా వీరికి ఎటువంటి గుర్తింపు కార్డులను కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఎటువంటి చిన్న ఉద్యోగిని నియమించుకున్నా వారికి నియామకపత్రం, గుర్తింపు కార్డులను ప్రభుత్వం విధిగా మంజూరు చేయాల్సి ఉంది. వీరికే కాదు టెండర్ల విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల మంది పారిశుద్ధకార్మికులకూ నియామకప త్రాలు, గుర్తింపుకార్డులను ప్రభుత్వం మంజూరు చేయలేదు.
తప్పని వెట్టి చాకిరి
జీతాలివ్వకపోయినా పంచాయతీ పారిశుధ్య కార్మికు లతో రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటోంది. పంచాయతీల్లో అవ సరానికి అనుగుణంగా ఉద్యోగులు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు వీరితో వివిధ రకాల పనులను చేయించు కుంటూ పబ్బం గడుపుకుంటు న్నారు. జీతాలిప్పించడంలో మాత్రం పంచాయతీ కార్యదర్శులు చొరవ చూపడం లేదని కార్మికులు వాపోతున్నారు. పంచాయతీ బిల్లు కలెక్టరు నిర్వర్తించాల్సిన విధులనూ, పారిశుధ్య కార్మికులతోనే పంచాయతీ కార్యదర్శులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా అధికారులు 6 నెలలుగా జీతాలివ్వ కుండా, రోజంతా నిర్వి రామంగా కార్మికు లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.
ఇచ్చిన హామీలు నెరవేరేదెన్నడు?
టెండర్ల విధానంలో రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 27వేల మంది కార్మికులకు వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ ప్రకటనకే పరిమితమైంది. అదే విధంగా వీరికి వర్తింపజేయాల్సిన ఇఎస్ఐ, పిఎఫ్ వంటి సదుపాయాలను కల్పించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుకోసం వేలాది మంది కార్మికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.