- సిఎం జగన్ అధ్యక్షతన తొలి సమావేశం
- రుణ ప్రణాళిక ఆవిష్కరణ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి:
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బిసి) సమావేశాన్ని ఈ నెల 18న నిర్వహిస్తున్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నరకు సచివాలయంలోని సిఎం బ్లాక్‌లో భేటీని ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహిస్తారు. 2019-20 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను సిఎం ఆవిష్కరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. నిరుటి వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన అజెండా నోట్స్‌ను ముఖ్యమైన అన్ని విభాగాలకు పంపారు. వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా తమ ప్రభుత్వ ప్రాధాన్యతలపై సిఎం బ్యాంకులకు దిశా నిర్దేశం చేస్తారని సమాచారం. ఈ ఏడాది రబీ నుంచి ప్రారంభమయ్యే రైతు భరోసా పంపిణీ, రైతులకు వడ్డీ లేని, పావలా వడ్డీ రుణాల అమలు, వ్యవసాయ బీమా ప్రీమియం మొత్తాన్నీ సర్కారు చెల్లించే పక్షంలో ఆ పథకం ఏ విధంగా అమలు పర్చాలి, డ్వాక్రా రుణాల దశలవారీ మాఫీ, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, తదితర వర్గాల వారికి స్వయం ఉపాధి రుణాలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ, వచ్చే ఏడాది నుంచి అమలు పర్చే అమ్మఒడి పథకం అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా 2018-19లో ప్రతిపాదించిన రుణ ప్రణాళిక కంటే 11.18 శాతం అధికంగా రుణాలిచ్చినట్లు ఎస్ఎల్బిసి రూపొందించిన అజెండా నోట్స్‌లో పేర్కొన్నారు. ప్రాధాన్యతా రంగాలకు మూడు శాతం అధికంగా అప్పులిచ్చామన్నారు. మొత్తం వ్యవసాయ రుణాలు 104.92 శాతం, పంట రుణాలు 102.29 శాతం ఇచ్చామని తెలిపారు. కౌలు రైతులకు రూ.4,266 కోట్లు (56.89 శాతం) పంపిణీ చేశామన్నారు.
18న బ్యాంకర్ల భేటీ
