- పురుగుల మందు తాగి దంపతులు, పిల్లలు మృతి
ప్రజాశక్తి-కొమరోలు (ప్రకాశం):
ఆన్లైన్ జూదానికి ఓ కుటంబం బలైంది. అప్పుల బాధతాళలేక మనస్థాపానికి గురై భార్య, పిల్లలకు పురుగుల మంది తాపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన శుక్రవారం అర్ధరాత్రి ప్రకాశంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కొమరోలు మండలం అల్లీనగరం గ్రామానికి చెందిన జక్కా రాఘవేంద్ర నాగరాజు (45), ఈశ్వరమ్మ (40) వీరికి వైష్ణవి(13), వరలక్ష్మీ(12) ఇద్దరు పిల్లలు. నాగరాజు చెడు వ్యసనాలకు బానిసై ఐదేళ్ల క్రితం అప్పులపాలయ్యారు. దీంతో గ్రామం విడిచిపెట్టి బెంగళూరులోని ఓ హోటల్లో పనిచేస్తూ కొంతమేర అప్పులు తీర్చాడు. అదే సమయంలో మట్కా (ఆన్లైన్ జూదం)కు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగి చెల్లించలేని స్థితికి చేరాడు. నెల క్రితం స్వగ్రామానికి చేరుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితులు, బంధువుల వద్ద చెప్పాడు. వారంతా ధైర్యం చెప్పారు. అప్పు తీర్చే పరిస్థితి లేదని, తాను ఆత్మహత్య చేసుకుంటానని, మీరు కూడా తనతోపాటు చావుకు సిద్ధమవ్వాలని భార్యా, బిడ్డలను ఒత్తిడి చేశాడు. తమ చావుకు ఎవ్వరూ బాధ్యులు కాదని లేఖ రాశాడు. శుక్రవారం కుటుంబం మొత్తం పురుగుల మందు తాగారు.ఇంటి లోపలి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి..లోపలికి వెళ్లి చూడగా అప్పటికే నాగరాజు, ఈశ్వరమ్మ చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరు కుమార్తెలను గిద్దలూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
జూదానికి కుటుంబం బలి
