* విధానాలపై వ్యక్తిగత
ప్రకటనలొద్దన్న సిఎం
* నోరు అదుపులో పెట్టుకోవాలన్న పవన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
జనసేన నాయకులు టిడిపితో టచ్లో ఉన్నారని, మార్చిలో సీట్లపై చర్చించే అవకాశం ఉందని మాజీ మంత్రి, టిడిపి ఎంపి టి.జి.వెంకటేష్ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. ఉండవల్లిలో సిఎంను కలిసిన అనంతరం మీడియాతో టిజి చేసిన ఈ వ్యాఖ్యలను సిఎం కొట్టి పారేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయమనం కోల్పోరాదని సూచించారు. టిజి వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, తాము వదిలేసుకున్న రాజ్యసభ సీటుకు ఎంపికైన టిజి వ్యాఖ్యానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఇటువంటి కుయుక్తులు పన్నుతున్నారని, తాము టిడిపితో కలిసి పోటీ చేయాలనిగానీ, కలవాలనిగానీ ఆలోచన లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో తాము అధికారానికి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా తానలా అనలేదని, చర్చించే ఆలోచన మాత్రమే ఉందని చెప్పానని టిజి మీడియాకు వివరణ ఇచ్చారు.
జనసేనపై టిజి వివాదాస్పద వ్యాఖ్యలు
