- టిడిపిలో ఎమ్మెల్సీ ఇచ్చేలా ఒప్పందం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
వైసినిని వీడిన వంగవీటి రాధాకృష్ణను టిడిపిలోకి తీసుకెళ్లేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పించి, అవసరాన్ని బట్టి మంత్రి పదవినిగానీ, మరో రాష్ట్రస్థాయి పదవినిగానీ ఇచ్చేలా అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయి రాజకీయంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ద్వారా కొంత ఒడ్డున పడొచ్చని రాధా ఆలోచనతో ఉన్నారు. ఆయన్ను టిడిపిలో చేర్చుకోవడం ద్వారా కోస్తా ప్రాంతంలో గణనీయంగా ఉన్న కాపు ఓట్లను పూర్తిగా టిడిపివైపు తిప్పుకోవచ్చనే ఆలోచనతో టిడిపి అధిష్టానం ఉంది. అలాగే కీలక నగరమైన విజయవాడలో పార్టీకి ఓ సామాజికవర్గంలో బలమైన పట్టు వస్తుందనే అంచనా కూడా వేస్తున్నారు. అయితే జనసేన వైపు నుండి ఆహ్వానం రాలేదని, రాజీనామా చేశామని తెలిసినా పార్టీవైపు నుండి ఎవరూ సంప్రదించలేదని రాధా అనుచరులు తెలిపారు. టిడిపి నుండి పిలుపు వచ్చిందని, దీనికి తగిన చర్చలు జరుగుతున్నాయనీ స్పష్టం చేశారు. ఎందులో చేరాలి అనే అంశంపై ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదని, సోమవారం రాత్రి ముఖ్య అనుచరులతో జరిగే చర్చల అనంతరం ఏం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని రాధా అనుచరులు చెబుతున్నారు.
రాధాతో ఐపిఎస్ మధ్యవర్తిత్వం
