ప్రజాశక్తి- రేగిడి (శ్రీకాకుళం):
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలిలోని ఇఐడి ప్యారీ చక్కెర కర్మాగారం మెయిన్‌గేటు వద్ద చెరకు రైతులు సోమవారం ధర్నా చేశారు. టన్ను చెరకుకు కనీస మద్దతు ధర రూ.3,500 చెల్లించాలని, కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు రూ.250 సలహా ధర ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఎపి చెరకు రైతుల సంఘం ఆధ్వర్యాన ఆందోళన చేపట్టారు. యాజమాన్య రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎపి చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సకాలంలో చెరకు కటింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరకు నాటిన జాబితా ప్రకారం కటింగ్ ఆర్డర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరకు మొక్కకు రూ.10 వేలు, మమ్ముకి రూ.ఐదు వేలు ప్రోత్సాహకంగా యాజమాన్యమే చెల్లించాలని కోరారు. ప్రోత్సాహకాలకు, దిగుబడికి ఎటువంటి నిబంధనలూ విధించరాదని డిమాండ్ చేశారు. నష్టపోయిన చెరకుకు నష్టపరిహారంగా టన్నుకు రూ.2,500 చొప్పున చెల్లించాలని కోరారు. అనంతరం ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎ.నాగశేషారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు తదితరులు ప్రసంగించారు.
చెరకు రైతుల ధర్నా
