- ప్రతి నిరుపేదకూ భూమివ్వాలి
- బికెఎంయు జాతీయ అధ్యక్షులు పెరియస్వామి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
వ్యవసాయ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) జాతీయ అధ్యక్షులు పెరియస్వామి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ముందున్న రాజకీయ లక్ష్యమన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల సమస్యల్ని ప్రధాని మోడీ పట్టించుకోలేదన్నారు. కార్పోరేట్లు, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిరు పేదలందరికీ భూమిని పంపిణీ చేయాలని, ఇళ్లు మంజూరు చేయాలని, నరేగాలో ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా సమర్థవంతంగా అమలు చేయాలని, పేదలకు విద్య, వైద్యాన్ని అందించాలని, అంటరానితనాన్ని నిర్మూలించాలన్న డిమాండ్లతో ఉద్యమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడంతో గ్రామీణ పేదలంతా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు పేద ప్రజల వ్యతిరేక ప్రభుత్వాలుగా మారాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు గడుస్తున్నా ఎక్కడా పేదలకు ఒక్క ఎకరం భూమి కూడా పంపిణీ చేయలేదన్నారు. వేలాది ఎకరాల భూముల్ని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించి కార్పోరేట్లకు కట్టబెడుతోందన్నారు. భూమికోసం, భుక్తికోసం బికెఎంయూ నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి విల్సన్, ఆవుల చంద్రశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యులు బండి వెంకటేశ్వరరావు, పి.కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 26న దేశవ్యాప్త ఆందోళనలు
