- ఆర్టీసి ఇడి జయరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
సంక్రాంతి తర్వాత ప్రయాణికుల్ని తమ నివాస ప్రాంతాలకు చేర్చేందుకు 3,020 ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేశామని ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) జి జయరావు తెలిపారు. ఈనెల 16నుండి 20 వరకు ఈ బస్సులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నై , బెంగళూరు, హైదరాబాద్ వంటి రాష్ట్రేతర ప్రాంతాలతోపాటు విశాఖ, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం మొదలైన ప్రాంతాలకు ముఖ్యంగా ఈ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ నగరానికి 1,115 బస్సులు నడుపుతున్నామనీ, వాటిలో విజయవాడ నుండి 275, గుంటూరు నుండి 150, ఒంగోలు నుండి 160, తూర్పుగోదావరి నుండి 150, కర్నూలు నుండి 100 ,పశ్చిమగోదావరి నుండి 75 బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. బెంగళూరుకు 570 బస్సులు నడుపుతున్నామనీ, వాటిలో చిత్తూరు నుండి 200, కడప నుండి 110, కర్నూలు నుండి 90, నెల్లూరు నుండి 55, అనంతపురం నుండి 50, మిగిలిన ప్రాంతాల నుండి మరికొన్ని బస్సుల్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. చెన్నై నగరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి 202 బస్సులు నడుపుతున్నామనీ, వీటిలో విజయవాడ నుండి 35, నెల్లూరు నుండి 35, కడప నుండి 35 బస్సులున్నాయనీ స్పష్టం చేశారు. విశాఖపట్నానికి 219 బస్సులు నడుపుతున్నామనీ, ఇవి ప్రధానంగా విజయనగరం, శ్రీకాకుళం నుండి 110, తూర్పుగోదావరి నుండి 72 బస్సులు ఏర్పాటు చేశామనీ తెలిపారు. విజయవాడ నుండి అమలాపురం, రాజమండ్రి వైపు 175 బస్సులు నడపాలని సంస్థ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి నుండి విజయవాడకు 123 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తిరుగు ప్రయాణానికి 3,020 ప్రత్యేక బస్సులు
