- అనంత, కడపల్లో నిరసనలు
- అడ్డుకున్న పోలీసులు
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్/ బ్రహ్మంగారిమఠం:
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ భూములపై నకిలీ పాసుపుస్తకాలు సృష్టించి కబ్జా చేస్తున్న సంఘటనలపై తక్షణం విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం టవర్‌క్లాక్ వద్ద భూబకాసురుల దిష్టిబొమ్మలను బోగి మంటల్లో దహనం చేశారు. ఆ సమయంలో టూ టౌన్ ఎస్ఐ లింగన్న, కానిస్టేబుల్ చత్రు నాయక్‌లు అడ్డుకున్నారు. తాము చెప్పినట్టు వినాలని పరుష పదజాలంతో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, తోటి నాయకలను దూషించారు. దీంతో సిపిఎం నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మూడో పట్టణ సిఐ మద్దిలేటి, ఎస్ఐ క్రాంతిలు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువురికి సర్దిచెప్పారు.
భూకబ్జాదారులను అరెస్టు చేయాలి : రాంభూపాల్
గతంలో రోడ్లు, కాంట్రాక్టులు చేసి అక్రమాలకు పాల్పడే కొందరు రాజకీయ నాయకులు నేడు ఏకంగా వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ అన్నారు. కొంత మంది అవినీతి రెవెన్యూ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములను గుర్తించడం, పాసుపుస్తకాలు సృష్టించుకోవడం, బ్యాంకుల్లో రుణాలు పొందుతున్నారని అన్నారు. గత మూడు సంవత్సరాల్లో 5 మండలాల్లోనే 12 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ రకంగా కబ్జా చేశారన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోపాల్, చంద్రశేఖర్ రెడ్డి, బిహెచ్.రాయుడు, రామిరెడ్డి, ఓబులేసు, వై.నాగరాజు, నాయకులు ప్రకాష్, నాగప్ప, సికిందర్, వలి పాల్గొన్నారు.
కడపలోనూ...
మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శిర్గ సభ్యులు జి.శివకుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఐదు రోడ్ల కూడలిలో రెవెన్యూ అధికారుల అవినీతికి నిరసనగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి అందులో అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. శివకుమార్ మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు రైతుల భూములను ఆన్లైన్ చేసే పేరుతో వేలాది రూపాయల లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తక్షణం రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
భూ బకాసురుల దిష్టిబొమ్మ దహనం
