- మధు, రామకృష్ణ పిలుపు
- రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ప్రదర్శనలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు
ప్రజాశక్తి- యంత్రాంగం:
బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనగా, లౌకికవాదాన్ని పరిరక్షించాలని కోరుతూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు బ్లాక్ డే పాటించాయి. పలుచోట్ల రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహించాయి. ఇందులో భాగంగా ర్యాలీలు, ప్రదర్శనలు, సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. లౌకికవాద పరిరక్షణపై వక్తలు ఉద్ఘాటించారు. గుంటూరులో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ), ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. జిల్లాలోని పలు పట్టణ, మండల కేంద్రాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నూజివీడులో ధర్నా, తిరువూరులో బైక్ ర్యాలీ, జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేటలో ముస్లిములు శాంతి ర్యాలీ నిర్వహించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా మచిలీపట్నంలో నిర్వహించిన సదస్సులో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గపూర్ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ప్రశాంతంగా ఉన్న అయోధ్యలో తిరిగి రామమందిర నిర్మాణ పేరుతో హిందూ సంస్థలను బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. విజయవాడలో బ్లాక్ డే పాటించారు. సింగ్‌నగర్ ఎల్బిఎస్ నగర్లో సిపిఎం, దళిత సంఘాల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించారు. నల్లచీరను ప్రదర్శిస్తూ దానిపై 'బిజెపి, ఆర్ఎస్ఎస్ మతోన్మాదాన్ని ఖండించండి, మతోన్మాదాన్ని వ్యతిరేకించండి, లౌకికవాదాన్ని కాపాడండి, మతం పేరుతో దేశాన్ని చీల్చే పార్టీలను దూరంగా ఉంచండి.' అనే నినాదాలను రాశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సింగ్‌నగర్‌లోని 53, 54 డివిజన్లలో నూరే ఇస్లాం పాత మసీదు వద్ద నిరసన తెలిపి నినాదాలు చేశారు. మతోన్మాదుల చర్యలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగ లౌకికవాద పరిరక్షణ దినం పేరుతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన విశాఖలో ర్యాలీ, జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక లౌకికతత్వానికి, రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందన్నారు. మతతత్వ శక్తుల దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో సిపిఎం ఆధ్వర్యాన ర్యాలీ జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో హిందూ ఉగ్రవాదం పెరిగిందని, రాజ్యాంగాన్ని, లౌకికతత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం, సిఐటియు, కెవిపిఎస్, జనసేన, దళిత ప్రజావేదిక నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరంలో సిపిఎం, సిపిఐ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యాన రాజ్యాంగ పరిరక్షణ దినం నిర్వహించారు. కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాజీ చెరువు సెంటర్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ జరిగింది. నెల్లూరులో వి.ఆర్.సి సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకూ సిపిఎం, సిపిఐ, డివైఎఫ్ఐ, ఐద్వా, కెవిపిఎస్, ప్రజాతంత్రవాదులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కర్నూలులో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ర్యాలీ నిర్వహించారు.
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా ప్రతినబూనాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు పిలుపునిచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీపీఐ, సీపీఎం నగర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం విజయవాడలోని చాంద్ కల్యాణమండపంలో లౌకికవాద పరిరక్షణ సభ జరిగింది. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షత జరిగిన ఈ సభలో మధు మాట్లాడుతూ బీజేపీతోపాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి సంస్థలు మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. బాబ్రీ మసీదు కేసును జనవరి తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ మాత్రం ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా రామమందిరాన్ని నిర్మించాలని కేంద్రంపై వత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే, పాతరేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. మతోన్మాద శక్తులు దళితులు, మైనార్టీలపై పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ కన్వీనర్ చింతల పార్ధసారధి మాట్లాడుతూ దేశంలో వేలాది కులాలు, వందలాది మతాలున్నప్పటికీ భారతీయతకే ప్రాధాన్యత ఉందన్నారు. అందర్నీ కలుపుకొని నిరుపేదల కోసం పోరాటం సాగించడమే జనసేన సిద్ధాంతమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు కె.చాంద్, అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇటు ఉత్తర భారతదేశంలో బాబ్రీ మసీదును, అటు దక్షిణభారతంలో శబరిమాల అంశాన్ని అడ్డంపెట్టుకుని లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని షాదీఖానాలో గురువారం నిర్వహించిన 'లౌకికతత్వం- రాజ్యాంగ పరిరక్షణ' అంశంపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చిందని, కానీ మోడీ నాయకత్వంలో బిజెపి అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో దాని మనుగడకే ప్రమాదం వాటిల్లిందని అన్నారు. '25 నిమిషాల్లో బాబ్రీ మసీదును కూల్చాం.. 25 ఏళ్లయినా అక్కడ రామమందిరం నిర్మించలేకపోయాం' అని బిజెపి నాయకులు ఆందోళన చెందుతున్నారని, ఇప్పుడు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి అక్కడ రామమందిరం నిర్మించాలనే కుటిలయత్నం ఆర్ఎస్ఎస్, బిజెపి చేస్తున్నాయని అన్నారు. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, జనసేన నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ, లోక్‌సత్తా నాయకులు అశోక్‌కుమార్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అబ్దుల్, సిపిఎం పశ్చిమకృష్ణా జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లౌకికవాద పరిరక్షణకు ప్రతిన
