- కార్పొరేషన్ల వ్యవస్థ ప్రక్షాళన చేస్తా
- వెయ్యిమంది ఉంటే ఐదుగురికే రుణాలు
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో
తాను అధికారంలోకి వస్తే ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిసమయంలో వైఎస్ఆర్ దుల్హన్ పేరిట రూ. లక్ష చేయూతనిస్తామని వైఎస్ఆర్సిపి అధినేత వై ఎస్ జగన్మోహనరెడ్డి హామీనిచ్చారు. పిల్లలను ఏ స్కూల్‌కు పంపినా ఆ తల్లికి సంవత్సరానికి రూ.15వేలు అందిస్తామన్నారు. విశాఖ ఆరిలోవ బిఆర్టిఎస్ రోడ్డులో బుధవారం సాయంత్రం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం వివిధ వర్గాలకు రుణాలు, సహకారమందించే కార్పొరేషన్ల వ్యవస్తే బాగోలేదని, వాటిని ప్రక్షాళన చేసి అందరికీ రుణాలందేలా చేస్తామని ఆయన చెప్పారు. గ్రామంలో వెయ్యి మంది ఉంటే ఇపుడున్న ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా అందులో కేవలం 5 మందికి మాత్రమే రుణాలిస్తోందని, అవికూడా జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే ఇస్తున్నాయని వివరించారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ చేయూత పేరిట 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి కార్పొరేషన్ల ద్వారా రూ. 75వేలు అందజేస్తామన్నారు. ఐదేళ్లలో ఈ నగదు నాలుగు దఫాలుగా అందిస్తామన్నారు. వీటితో పాటు గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఆ గ్రామంలోనే పది మంది యువతకు ఉద్యోగాలిస్తామన్నారు. దరఖాస్తు పెట్టుకున్న 72 గంటల్లో పథకం వారికి దక్కేలా యువత పనిచేయాలన్నారు. ముఖ్యంగా ముస్లింలను చంద్రబాబు ప్రభుత్వం అణగదొక్కేస్తోందన్నారు. అనవసర కేసుల్లో వారిని ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ముస్లింల సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ముస్లింలు పాల్గొన్నారు.
తూర్పులో జగన్ పాదయాత్ర
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నగరంలోని తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. బుధవారం ఉషోదయ కూడలిలో ప్రారంభమైన పాదయాత్ర ఎంవిపి కాలనీ, ఇసుకతోట, వెంకోజీపాలెం మీదుగా హనుమంతువాక కూడలిలో ప్రవేశించారు. అక్కడ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి బిఆర్టిఎస్ రోడ్డు గుండా పందులఫారం, పెదగదిలి, చినగదిలి కూడలి వరకూ సాగింది. పందులఫారం వద్ద స్థానికులు విమ్స్‌ను ప్రయివేటుపరం చేయకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. సింహాచలం దేవస్థానం భూముల సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జగన్
తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ప్రజలకు విఘ్నాలు తొలగి ఇక మీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన ఆకాక్షించారు.
ముస్లిం మహిళల పెళ్లి ఖర్చుకు రూ.లక్ష : జగన్
