ప్రజాశక్తి-ఒంగోలు క్రైం
కిడ్నాపైన ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బంగారు వ్యాపారి బొగ్గు వెంకట ఆదినారాయణ (35) హత్యకు గురయ్యాడు. అతనిని కిరాతకంగా హత్య చేసివ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. త్రిపురాంతకం మండలం మెడిపి చెరువు వద్ద కాలిన ఓ మృతదేహన్ని దర్శి పోలీసులు కనుగొని అది ఆదినారాయణదిగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం దర్శి మెయిన్రోడ్లో బొగ్గు వెంకట ఆదినారాయణ బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. పదేళ్ల క్రితం పెళ్లయింది. అయితే పిల్లలు లేకపోవడంతో ఈనెల 14న భార్య ప్రసన్నకుమారితో కలిసి విజయవాడ వెళ్లి ఓ ఆసుపత్రిలో వైద్యుడ్ని కలిశారు. అనంతరం ఆమెను అక్కడే ఉమెన్స్ హాస్టల్లో ఉంచి రాత్రి 8.గంటలకు దర్శికి బయలుదేరారు. 11.30 గంటల సమయంలో భర్తకు ఆమె ఫోన్‌చేయగా, వర్షం పడుతున్నందున ముండ్లమూరులో ఆగినట్లు చెప్పారు. తరువాత కొద్దిసేపటికి ఫోన్ స్విచ్చాఫ్ అయింది. ఆదినారాయణ దర్శిలో తన షాపు పక్కనే ఉన్న రమణారెడ్డికి ఫోన్ చేసి రూ.5 లక్షలు తీసుకొని అద్దంకిలో ఓ వ్యక్తికి ఇవ్వమని చెప్పాడు. ఈ విషయం మరుసటి రోజు రమణారెడ్డి ప్రసన్నకుమారికి తెలిపాడు. దీంతో ఆమె పోలీసులకు మరుసటి రోజు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు పలువురిని విచారణ జరిపి చివరకు రూ.5 లక్షలు తీసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
బంగారు వ్యాపారి హత్య
