ప్రజాశక్తి - క్రోసూరు (గుంటూరు జిల్లా):
కేసులు బనాయించడం, అవమానాలకు గురిచేసి రూ.లక్షల్లో జరిమానాలు.. పోలీసులతో బెదిరింపుల కారణంగా యువ వ్యవసాయ కార్మికుడి ఆత్మహత్యకు దారితీశాయి. ఈ సంఘటన గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం నిండుజర్లలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నిండుజర్లకు చెందిన చప్పవరపు బాలయ్య(30) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవించే బాలయ్య, కె.సాంబయ్య కలిసి ఈనెల 10వ తేదీన తమ ఇంట్లో కోళ్లను దొంగిలించారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన పులి గురువులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై సర్పంచ్ భర్త ఆధ్వర్యంలో గురువారం పంచాయితీ పెట్టి రూ.లక్ష జరిమానా చెల్లించాలని ఎదుటిపక్షం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం బాలయ్య భార్య నాగమ్మ పొలం పనులకు వెళ్లిన అనంతరం బాలయ్య తన పూరింట్లోనే ఉరేసుకున్నాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. ఇదిలా ఉండగా బాలయ్యపై నేరం బనాయించిన వారికి సర్పంచ్ అండ ఉందని, పోలీసులు సైతం స్టేషన్కు పిలిపించి వేధించారని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని సందర్శించిన సిపిఎం పెదకూరపాడు ప్రాంతీయ కార్యదర్శి జి.రవి మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భర్త ఆలా నాగేశ్వరరావు గ్రామంలో పలువురిపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని, పేదల భూముల్లో మట్టిని అమ్ముకోడాన్ని ప్రశ్నించిన వారినీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
పోలీసులు, 'పెద్దల' వేధింపులతో వ్యవసాయ కార్మికుడి ఆత్మహత్య
