ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
రాష్ట్రప్రభుత్వం పెంచిన బడ్జెట్‌కు అనుగుణంగా విద్యాశాఖకు పెంచలేదు. బడ్జెట్లో పెరుగుదల కనిపించినా మొత్తం బడ్జెట్లో 12.98శాతం మాత్రమే విద్యాశాఖకు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే చాలా తక్కువ. మొత్తం విద్యాశాఖకు రూ.24,180 కేటాయించగా, సెకండరీ విద్యకు రూ.21,612కోట్లు ప్రతిపాదించింది. గత నాలుగేళ్లతో పోలిస్తే బడ్జెట్ శాతంలో విద్యకు తక్కువ శాతం కేటాయించింది. 2015-16లో 16.44శాతం, 2016-17లో 14.84శాతం, 2017-18లో 13.65శాతం కేటాయించగా, ఈ ఏడాది రూ.12.98శాతం కేటాయించింది. గత ఏడాది కేటాయించిన విద్యశాఖకు కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేకపోయింది. గత ఏడాది రూ.17,962కోట్లు కేటాయింపుకు రూ.17,492కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.100కోట్లు కేటాయించింది.
కేటాయింపులు సరే...చిత్తశుద్ది ఏదీ..?
ఉన్నత విద్యపై ప్రభుత్వాల దృక్పదం మారుతూ వస్తోంది. కేవలం మౌళిక వసతులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ...అభివృద్దిని పక్కనపెట్టేసినట్లు కనిపిస్తోంది. గురువారం అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో యూనివర్సిటీ అభివృద్దిపై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం విశేషం. కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులపై ఆధారపడాలన్నట్లుగా ఆర్ధిక మంత్రి చెప్పకనే చెప్పారు. పైగా గత మూడు సంవత్సరాలుగా ఉన్నత విద్యకు కేటాయింపుల్లో భారీగా కోత పెడుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు కలిపి రూ. 3,348.60 కోట్లు కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.2530.58 కోట్లు, సాంకేతిక విద్యకు రూ. 818.02 కోట్లు కేటాయింపులు జరిపారు. వీటిలో యూనివర్సిటీల్లో మౌళిక వసతుల కల్పన, తాత్కాలిక అవసరాల కోసం అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
అరకొర కేటాయింపులు:ఎస్ఎఫ్ఐ
బడ్జెట్లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసాపురం రమేష్, వై రాము గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. లక్ష్యాలకు అనుగుణంగా లేవని తెలిపారు. బిసి స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.4,100కోట్లు అవసరం కాగా, రూ.2,160కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. అరకొర నిధుల కేటాయింపులతో 2019 నాటికి సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంలో ఏవిధంగా అమలవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంకెల్లో పెరిగిందని శాతంలో తగ్గిందని యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పి బాబురెడ్డ్డి మరో ప్రకటనల విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యశాతం తగ్గుతూ వస్తోందని తెలిపారు.
అంకెలే పెరిగింది
ఎపి బడ్జెట్లో పాఠశాల విద్యకు మొత్తం బడ్జెట్‌తో పోల్చితే రూ.24వేల కోట్లే కేటాయించడం పెరుగుదల శాతం లేదు. ఉన్నత విద్యకు కేటాయింపులు ప్రస్తుత అవసరాలతో పోల్చితే ఎంతమాత్రం సరిపోదు. జాతీయ స్థాయి విద్యాసంస్థలకు స్థల సేకరణకు కొంత వ్యయం చేయాల్సి ఉంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నీ ప్రస్తుతం సంక్షోభంలో నడుస్తున్నాయి. వాటికి నిధులు పెంచే మార్గలు బడ్జెట్లో ప్రతిపాదించలేదు. ఆదర్శ పాఠశాలలకు కేటాయింపులు సరిపోవు. కస్తూర్బి విద్యాలయాల్లో పోస్టుల మంజూరు,ఎయిడెడ్ కళాశాలల్లో పోస్టుల భర్తీ ప్రతిపాదనలు చేయకపోవడం విచారకరం.
- కెఎస్ లక్ష్మణరావు విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు
బడ్జెట్ః విద్యకు పెరగని బడ్జెట్ 12.98 శాతమే కేటాయింపు
