- ప్రపంచంలో ఇంటర్ విద్య ఎక్కడా లేదు
- 28న విజయవాడలో బహిరంగ సభ
- కంచ ఐలయ్య
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో :
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నారాయణ, చైతన్య కాలేజీలను మూసేయాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ రెండు కాలేజీల్లో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, ఆ రెండు కాలేజీలపై చర్యల్లేవన్నారు. ప్రపంచంలో ఇంటర్ విద్య ఎక్కడా లేదని, మన దగ్గర మాత్రమే ఉందన్నారు. ఇక్కడ కూడా వెంటనే ఇంటర్ విద్యను ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపి టిడిపి ఎంపి టిజి వెంకటేశ్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. టిజి వెంకటేశ్ చేసిన వ్యాఖ్యల వల్ల అమెరికాలోని భారతీయులకు ప్రమాదకర పరస్థితులు కల్పించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దాడి, గౌరీ లంకేశ్ హత్య పరిణమాలతో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సీనియర్ సభ్యుడు ట్రెంట్ ఫ్రాంక్స్ భారతదేశంలో వాక్ స్వాతంత్య్రం ప్రమాదంలో పడిందంటూ ఆందోళన వ్యక్తం చేసిన సంగతిని గుర్తు చేశారు. దీనిపై ఎంపి టిజి ఆమెరికా సంస్కృతి, సెనెటర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. మానవ హక్కులకు గౌరవం ఇవ్వని దేశాల్లో అమెరికా పెట్టుబడులు పెట్టదన్నారు.
తనను చంపడం టైంవేస్ట్ అంటూ టిజి చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ, టైంవేస్ట్ కాకుండా చంపిన వారి జాబితాలో గౌరీ లంకేష్, కల్బుర్గి, పన్సరే ఉన్నారా.? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ, ఎపి సిఎం చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే వెంటనే టిజిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మద్రాసు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గించే కేసుల్ని నమోదు చేయకూడదన్నారు. ఈ నెల 28న విజయవాడలో నిర్వహించే ప్రతిఘటన ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బహుజన ప్రతిఘటన వేదిక అధ్యక్షుడు ఉసా మాట్లాడుతూ బిసి కులానికి చెందిన వ్యక్తికి రావాల్సిన రాజ్యసభ సీటును చంద్రబాబుకు రూ.100 కోట్లిచ్చి టిజి కొనుక్కున్నారని ఆరోపించారు. సమావేశంలో టీ మాస్ కన్వీనర్ జాన్‌వెస్లీ, బి వెంకట్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా కంచ ఐలయ్యను ఆర్యవైశ్యులు బెదిరించడాన్ని వారు ఖండించారు. ఐలయ్యపై నమోదు చేసిన కేసుల్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఒంటరి కాదని, మత, కులోన్మాదుల దాడులను ఐక్యంగా ప్రతిఘటిస్తామని వారు స్పష్టం చేశారు.
'నారాయణ, చైతన్య'లను మూసేయాలి
