- దాడుల నివారణకు జిల్లా స్థాయిలో కమిటీలు
- మూడు నెలలకోసారి హైపవర్ కమిటీ సమావేశం
- ఎపిడబ్ల్యూజెఎఫ్, మీడియా ప్రతినిధులతో సమావేశంలో డిజిపి సాంబశివరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
జర్నలిస్టుల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, జర్నలిస్టులకు సంబంధించిన కేసుల్ని ఆగస్టు మెదటి వారంలోగా పరిష్కరిస్తామని డిజిపి ఎన్.సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య(ఎపిడబ్ల్యూజెఎఫ్)కు, మీడియా ప్రతినిధులకు హామీ ఇచ్చారు. విజయవాడలోని డిజిపి కార్యాలయంలో సోమవారం సమావేశమై జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి రెండు గంటల పాటు వారు చర్చించారు. తొలుత దాడులకు సంబంధించి ఫెడరేషన్ రూపొందించిన ప్రదర్శనను డిజిపి తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియా వల్ల ప్రయోజనాలే అధికమని, దీన్ని గుర్తించి పోలీసు అధికారులు మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. దాడుల నివారణకు జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మూడు మాసాలకోసారి హైపవర్ కమిటీ సమావేశం జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. పోలీసు, మీడియా మధ్య సత్సంబంధాలు కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడమంటే వారికి రక్షణ కల్పించడమేనని అన్నారు. మహిళా జర్నలిస్టులకు సంబంధించిన ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా అండగా నిలుస్తామన్నారు. అవసరమైన సందర్భాలలో ప్రత్యేక అధికారితో విచారణ చేయిస్తానని ఫెడరేషన్ కోశాధికారి శాంతి లేవనెత్తిన ప్రశ్నకు బదులిచ్చారు. జిల్లాల్లో జర్నలిస్టుల కేసుల విషయంలో ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చి తగు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అన్ని జిల్లాల్లో పోలీసు అధికారులకు మీడియాతో సంబంధాలు మెరుగుపడేందుకు గాను చైతన్య శిబిరాల్ని నిర్వహించాల్సి ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులు జరిగిన సందర్భంలో నమోదవుతున్న కౌంటర్ కేసుల విషయంలో నిజానిజాలను నిగ్గు తేలుస్తామన్నారు. మీడియా వాస్తవాల్ని మీడియా వక్రీకరించకుండా తోడ్పాటునందించాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పి.పరమేశ్వరరావు, జి.ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు కె.శ్రీనివాస్, ఎ.అమరయ్య, వేణుగోపాలరావు, మీడియా ప్రతినిధులు వెంకటరెడ్డి, ధనుంజరు, రమేష్, నాగరాజు, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల రక్షణకు ప్రాధాన్యత
