బకాయి బిల్లులు చెల్లించండి
ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్
ఎండుతున్న పండ్ల చెట్లను ప్రభుత్వం కాపాండి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉత్తర ప్రాంత జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివారెడ్డిలు డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ఎండిపోతున్న చీనీ, మామిడి, ఇతర పండ్ల మొక్కలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా రైతులు నీటి రక్షక తడులు అందించారని తెలిపారు. ఇంత వరకు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదన్నారు. 2018- 19, 2019-20 సంవత్సరానికి గాను డబ్బులు చెల్లించాల్సి ఉందన్నారు. జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లలో రైతులు అన్ని రకాల పండ్ల తోటలు పండిస్తున్నారని తెలిపారు. వరుస కరువులతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు వేసినా నీళ్లు పడటం లేదన్నారు. చెట్లను బతికించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లను తోలుకోవడానికి లక్ష రూపాయలు అప్పులు చేసి నీళ్లు సరఫరా చేసి చెట్లను కాపాడుకున్నారని తెలిపారు. చెట్లు ఎండిపోతుంటే డబ్బులు లేక ముకుందాపురంలో ఒక రైతులు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ప్రభుత్వం చెట్లను బతికించడానికి ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకున్న రైతులకు ఒక్క ట్యాంకర్‌కు రూ.600 చొప్పున చెల్లిస్తామని ప్రకటించిందని అన్నారు. ఈ మేరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు రూ.6500 మంది రైతులు 7 వేల హెక్టార్లలో రూ.41 కోట్లు నీటి సరఫరా చేసిన వాటికి రైతులకు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారని తెలిపారు. 10 నెలలు కావస్తున్నా ఇంత వరకు డబ్బులు చెల్లించలేదన్నారు. 2018-19లో హార్టికల్చర్ శాఖ ద్వారా ఇంత వరకు మొక్కలు నాటుకున్న రైతులకు సబ్సిడీ ఇవ్వలేదన్నారు. తక్షణమే బకాయి బిల్లులు చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గందం చంద్రుడు ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం నాయకులు టి.రామాంజినేయులు, వెంకటక్రిష్ణయ్య, శివారెడ్డి, శ్రీనివాసులు, సుజాత, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎండుతున్న పండ్ల చెట్లను కాపాడాలి
