ప్రజాశక్తి- శ్రీకాకుళం రూరల్
స్పందనలో నమోదు చేసుకున్న ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని ట్రెయినీ కలెక్టర్ భార్గవ్ తేజ ఆదేశించారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన పౌర సరఫరాల విభాగంలో వచ్చిన స్పందనలను పరిశీలించారు. వాటికి ఏ మేరకు పరిష్కారం జరిగిందో కనుగొన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన రేషన్‌కార్డులకు వచ్చిన దరఖాస్తుల విషయాన్ని తెలుసుకున్నారు. ఒకే కుటుంబంలో ఉన్న వాళ్లు నూతనంగా రేషన్ కార్డు కావాలంటే ముందుగా వారి పాత కార్డుల నుంచి పేర్లను రద్దు చేసుకోవాలని సూచించారు. కుటుంబంలోని అందరూ తప్పనిసరిగా ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలన్నారు. ఒకవేళ లేకపోతే తహశీల్దార్ కార్యాలయంలో కానీ, ప్రజా సాధికార సర్వే కేంద్రాల వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను సివిల్ సప్లై సిబ్బంది, విఆర్‌ఒలు చేపట్టాలన్నారు. 72 గంటల్లోగా నూతన కార్డులు మంజూరవుతాయన్నారు. అనంతరం చిన్న బరాటం వీధిలో అర్జీదారుల ఇంటికెళ్లి ప్రజా సాధికార సర్వేలో భాగంగా అర్జీదారుల ఇళ్లకు జియోట్యాగింగ్ చేపట్టారు. కార్యక్రమంలో డిఎస్‌ఒ మోహన్‌రావు, తహశీల్దార్ ఐటి కుమార్, సూపరింటిండెంట్ వెంకటరావు, సివిల్సప్లై డిటి రాజు, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్ పాల్గొన్నారు.
తక్షణమే అర్జీలను పరిష్కరించాలి
