ప్రజాశక్తి-శ్రీహరిపురం , గోపాలపట్నం, పెందుర్తి
ఈనెల 15న సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహిస్తున్న మహాగర్జన బహిరంగ సభలకు సిపిఎం పార్టీ మల్కాపురం జోన్ ఆధ్వర్యాన శుక్రవారం 47వ వార్డు లేబర్ జంక్షన్, నెహ్రూనగర్, హనుమాన్ నగర్, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సిపిఎం కార్యదర్శి ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ బిజెపి, టిడిపి వైసిపిలు సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు. నూతన రాజధాని నిర్మిస్తామని చెప్పి నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో బాలికలపై అత్యాచారాలు, అక్రమ రవాణా అధికమయ్యాయని ఆరోపించారు. టిడిపి, బిజెపి విధానాలతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. మహాగర్జన విజయవాడలో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే నూతన ప్రత్యామ్నాయం కావాలని సిపిఎం కృషి చేస్త్తుందన్నారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి లక్షలాది ఎకరాలు బలవంతంగా తీసుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు నెలకు కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, జె.రామునాయుడు, పాల్గొన్నారు.
గోపాలపట్నం : విజయవాడలో తలపెట్టిన మహా గర్జన సభను జయప్రదం చేయాలని కోరుతూ, గోపాలపట్నం డివిజన్ కమిటి నాయకులు లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్, ఇందిరనగర్ ప్రాంతాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటి కార్యదర్శి డి. అప్పలనాయుడు మాట్లాడుతూ, గత నాలుగేళ్లలో రాష్ట్ర రాజకీయాలు బ్రష్టు పట్టిపోయాయని అన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, సామాజికన్యాయం, రైతుసంక్షేమం, నాణ్యమైన విద్యా, వైద్యం అవినీతి రహిత పాలన కోసం ప్రత్యామ్మాయ రాజకీయ అవసరాల కోసం మహాగర్జన సభను సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు చలో విజయవాడ కార్యక్రమానికి హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డి.ఉమాకుమారి, పి.అనసూయ, పి.సూర్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెందుర్తి : నూతన రాజకీయ వ్యవస్థ రావాలని సిఐటియు నాయకులు బిటి.మూర్తి అన్నారు. 70వ వార్డు కృష్ణా రాయపురంలో మహాగర్జన ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్ధుత రాజకీయాల్లో డబ్బులు పంచి, గెలిచిన తర్వాత ప్రజలు సంక్షేమాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ప్రజల కోసం కష్టపడే రాజకీయ నాయకులను ఎన్నుకోవాలన్నారు.. బిజెపికి గడ్డుకాలం దాపురించిదన్నారు ఈ కార్యక్రమంలో జి.అప్పలరాజు, బి.అనంతలక్ష్మి, కుమారి పాల్గొన్నారు.
మహాగర్జనకు సిపిఎం విస్తృత ప్రచారం
