వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, టిడిపి కార్యకర్తలను 56 మందిని పొట్టన పెట్టుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రొద్దం మండల పరిధిలోని సానిపల్లి గ్రామంలో గ్రామదర్శిని వికాసం కార్యక్రమంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న జగన్ టిడిపి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నాడని తెలిపారు. ప్రజల నేత పరిటాల రవిపై కక్షగట్టి హత్యచేయించారని మండిపడ్డారు. టిడిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందన్నారు. ఇప్పటి వరకు 23లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇరిగేషన్ తర్వాత ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు పెడుతోందన్నారు. ఎమ్మెల్యే బికె పార్థసారధి మాట్లాడుతూ సానిపల్లి గ్రామంలో 71 ఇళ్లు మంజూరు చేశామన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్ కుట్రల వల్లనే హంద్రీనీవా కాలువ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు. లేపాక్షి, రొద్దం, సోమందేపల్లి, పరిగి చెరువులకు నీరు అందిస్తామన్నారు. పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాలు అహుడా కింద 10వేల ఇళ్లు మంజూరైనట్లు వివరించారు. రొద్దం మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్లేసిన తర్వాతనే ఓట్లు అడిగేందుకు వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన గృహాలకు భూమిపూజ, ఇల్లు పూర్తి చేసుకున్న వారికి గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఇఇ చందమ్రౌళిరెడ్డి, డిఇ నాగరాజు, ఎఇ శ్రీనివాసులు, ఎంపిపి పద్మా అక్కులప్ప, జెడ్పిటిసి చిన్నప్పయ్య, మార్కెట్‌యార్డు ఛైర్మన్ వెంకటరామిరెడ్డి నాయకులు నారాయణరెడ్డి, మాదవనాయుడు, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.
వైఎస్ హయాంలో రాక్షస పాలన
