వేదగిరి రాంబాబు ... పేరు చెబితేనే కథకొక ఉత్తేజం. కథకులకు ఉత్సాహం. ఆయన కథానికకు, కథాసాహిత్యానికి చేసిన సేవ మరువలేనిది. గురజాడ వెలుగులను అందరికీ పంచాలని తపించినవాడు. గురజాడ దార్శనికత, అసంపూర్తి రచనలు, అనారోగ్యం వీటి గురించే చెప్పేవారు. శ్రీపాద విగ్రహాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేసేవరకూ ఆయన నిదురపోలేదు. వాకాటి పాండురంగారావు గారితో కలిసి బంగారు కథలు సంకలనం సాహిత్య అకాడెమీ కోసం ఎడిట్ చేశారు. డి.వెంకట్రామయ్య గారి కథలను, ఇచ్ఛాపురపు జగన్నాధరావు, అరిగే రామారావు వంటి ప్రముఖుల సంకలనాలను ఎంతో శ్రమకోర్చి వెలువరించారు. ఏదైనా విషయం నచ్చకపోతే ముక్కుసూటిగా చెప్పేవారు. చింతా దీక్షితులంటే అపార ప్రేమ. ఆరోగ్యాన్ని లెక్క చేయని మొండి మనిషి. దేహం శుష్కించినా సాహిత్యం గురించి మాట్లాడే తపనని, తాపత్రయాన్ని ఏమాత్రం కోల్పోని మనిషి. 66 ఏళ్ల వయసులో ఈనెల 18వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంట తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. మంచానికి పరిమితమయ్యారు. ఇటీవల అజోవిభో అవార్డు కూడా ఆయనికి ఇంటికి వచ్చి అందచేశారు.
వేదగిరి రాంబాబు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చుండూరులో 1952 అక్టోబరు 14న జన్మించారు. తండ్రి పూర్ణచంద్రరావు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగి. ఆయన రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు బదిలీపై వెళ్లటం వల్ల- రాంబాబు బాల్యం, చదువు అంతా వివిధ ప్రాంతాల్లో సాగింది. నాటకాల్లో కానీ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించటం కానీ ఆయన తండ్రికి ఇష్టం ఉండేది కాదు. డిగ్రీ చదువుతున్నప్పుడే రాంబాబులో సాహిత్యం పట్ల క్రమంగా అభిరుచి పెరిగింది. ప్రముఖ రచయితలైన యర్రంశెట్టి సాయి, ఆదివిష్ణు, విహారిలను ఆయన తన గురుతుల్యులుగా భావిస్తారు. 1974లో డిగ్రీ ఫైనలియర్లో ఉండగా, ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తొలికథ 'సముద్రం' బహుమతి సాధించిపెట్టింది. తరువాత యువ, జ్యోతి, స్వాతి, ఆంధ్రపత్రికలకు కథలు రాశారు. కొంతకాలం ఆకాశవాణిలో అనౌన్సర్‌గా పనిచేశారు. ఆయన కథానికలకు రేడియో ద్వారా మంచి ప్రాచుర్యం లభించింది.
రాంబాబు వివిధ పత్రికల్లో పనిచేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానూ దినపత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో, తరువాత పల్లకి వారపత్రిక సంపాదకుడిగా పనిచేశారు. ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా తనలోని రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. దూరదర్శన్ అందుబాట్లోకి వచ్చాక- దృశ్య మాధ్యమాన్ని సామాజిక అస్త్రంగా మలిచి జనాల్లో మార్పు తేవాలని ఆశించారు. ఆ క్రమంలోనే 'పాపం పసివాడు' సీరియల్‌ను 52 వారాలపాటు దూరదర్శన్‌లో ప్రసారం చేశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి దూరదర్శన్ టెలీ సీరియల్‌ను తన సొంత ఖర్చుతోనే తీర్చిదిద్దారు. ఆయన నిర్మించిన టెలిఫిల్కు ఉత్తమ నిర్మాత, దర్శకుని విభాగాల్లో బంగారు నంది అవార్డు దక్కింది. తర్వాత 'అడవి మనిషి' సీరియల్‌కు రజిత నంది వచ్చింది. దూరదర్శన్‌లో శైలజాసుమన్, రమణీసన్యాల్ వంటివారితో కలిసి పనిచేశారు. దాదాపు రెండేళ్ల పాటు ఎంతో కష్టపడి జైలు అధికారుల అనుమతి తీసుకుని రాష్ట్రంలోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల యథార్థ గాథలను సేకరించారు. వాటినే కథావస్తువులుగా చేసుకుని 'జైలుగోడల మధ్య' సీరియల్‌గా రూపొందించారు. అంతకుముందే అది స్వాతి వారపత్రికలో దాదాపు 60-70 వారాలపాటు ధారావాహికగా పాఠకులను అలరించింది. 'జైలుగోడల మధ్య' పుస్తకరూపంలో దాదాపు చాలా భాషల్లో అనువాదితమైంది. బాలసాహిత్యంలో ఆయన చేసిన ప్రయోగాలు అన్నీ ఇన్నీ కావు. 'ఇంద్రధనుస్సు' అనే బాలల తొలి వీడియో మేగజైన్‌కు తొలి ఎడిటర్‌గా పనిచేశారు ఆయన.
రకరకాల కథావస్తువులు తీసుకొని ప్రయోగాత్మకంగా కథలు రాయటం రాంబాబుకు అమితాసక్తి. పదహరేళ్ల వయసు, కాలమ్ దాటని కథలూ ఆయన ప్రయోగశీలతకు నిదర్శనంగా నిలుస్తాయి. తెలుగు కథానికకు మంచి గుర్తింపు రావాలని ఆయన బలంగా కోరుకునేవారు. 2010లో తెలుగు కథానికకు వందేళ్ల ఉత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరంలోని గురజాడ ఇంటినుంచి మొదలుకొని రాష్ట్రంలోని పలు పట్టణాల్లో సభలూ సదస్సులూ జరిపారు. కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రాజమహేంద్రవరంలో నెలకొల్పటంలో అంతా తానే అయ్యి కృషి చేశారు. ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా అందులో శ్రోతగానైనా పాల్గొనటానికి ఆయన ఉత్సాహం చూపేవారు. వంద తెలుగు ప్రముఖ కథానికల వివరాలతో 'తెలుగు కథానిక డాట్ కామ్' కూడా ప్రారంభించారు. 23 జిల్లాల కథానిక తీరుతెన్నుల గురించి పోటీపెట్టి వ్యాసాల్ని సేకరించారు. ఈ వ్యాస సంకలనాలను ఆవిష్కరించారు. రచయితల చిరునామాలతో ఒక డైరెక్టరీని తీసుకొచ్చారు. శ్రవ్య, దృశ్య మాధ్యమాల్లో కూడా ఈ సాహిత్యాన్ని, ఔన్నత్యాన్ని చూపించడానికి కృషి చేశారు. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ అనే సంస్థను స్థాపించి కథానిక ప్రాచుర్యానికి కృషి చేశారు. ఇది కథానికకే అంకితమైన సంస్థ. 'కథానిక.. కొత్త కదలిక .. కదులిక' అనేది ఈ సంస్థ నినాదం. ఈ కార్యక్రమాలన్నీ ఎవర్నించీ ఎటువంటి సహాయం స్వీకరించక కేవలం తన సొంత సంపాదనతో నిర్వహించారు. కొత్త రచయితలను ప్రోత్సహించటంలో ముందుండేవారు. పిల్లల్లోకి సాహిత్యం విస్తృతంగా వెళ్లాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తపించేవారు. ఆయన ప్రతిఏటా ఉత్తమ బాలసాహిత్య గ్రంధాలను కొని, పిల్లలకు పంచేవారు. ఆయన కథకు, కథకులకు మంచి మిత్రుడు... సన్నిహితుడు. ఆయన మృతి కథానికకు, బాలసాహిత్యానికి తీరని వెలితి. కథానిక సాహిత్యం మరింత ముందుకు వెళ్లటమే ఆయనకు నివాళి.
- అక్షర
కథకు, కథకులకు హితుడు
