ఎంచుకున్న రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ప్రదర్శించేవారు... ఇతరుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందుంటారు. దీనికి జాబ్‌మార్కెట్ కూడా అతీతం కాదు. అప్రెంటీస్‌షిప్‌తో తరగతిగదిలో నేర్చుకున్న అకడమిక్ నైపుణ్యాలను వృత్తి నైపుణ్యాలుగా మార్చుకోవచ్చు. ఫలితంగా ఉద్యోగ ఔత్సాహికులు అవకాశాలను అందుకునేందుకు కావాల్సిన అర్హతలు సాధించవచ్చు. ఈ నేపథ్యంలో కెరీర్ పరంగా అప్రెంటీస్‌షిప్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....
'స్కిల్ గ్యాప్'.. ఇండిస్టీ వర్గాల నుంచి నిరంతరం వినిపించే మాట! 'కోర్సు పూర్తయింది... కానీ, ఉద్యోగం లభించట్లేదు. ఎక్కడికెళ్లినా వృత్తికి సంబంధించిన వాస్తవ పరిస్థితుల అనుభవం గురించే అడుగుతున్నారు' ఇది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న చాలామంది ఔత్సాహికుల స్పందన.
ఇండిస్టీ, ఉద్యోగ ఔత్సాహికుల మధ్య ఏర్పడిన గ్యాప్‌ను పూరించేందుకు అప్రెంటీస్‌షిప్ చక్కగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా టెక్నికల్ కోర్సుల విద్యార్థుల స్కిల్ గ్యాప్ సమస్యకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్‌తో సరైన పరిష్కారం లభిస్తోంది.
ఆన్ జాబ్ ట్రైనింగ్, రియల్ టైం ఎక్స్పీరియన్స్, ఆర్థిక తోడ్పాటుతో పాటు భవిష్యత్తు అవకాశాలను మరింత మెరుగు పరచుకునేందుకు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ దోహదపడుతుంది.
'మేక్ ఇన్ ఇండియా... స్కిల్ ఇండియా.. స్టార్టప్ ఇండియా' కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ అవ్వాలంటే.. నైపుణ్యాలున్న మానవ వనరులు తప్పనిసరి.
దేశ అవసరాలకు అనుగుణంగా యువతకు జాబ్ స్కిల్స్ అందించడమే కాకుండా ప్రపంచానికీ నిపుణులైన మానవనరులను అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది.
స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2022 నాటికి 40 కోట్ల మందికి ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
అప్రెంటీస్‌షిప్ ప్రాధాన్యం
టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాల ఆవశ్యకత రోజురోజుకీ పెరుగుతోంది. ఐటీఐ నుంచి ఐఐటీ వరకూ ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్నవారికే కంపెనీలు నుంచి ఆఫర్ లెటర్లు అందుతున్నాయి.
కోర్సు పూర్తయ్యాక సంబంధిత కోర్సుకు సంబంధించిన ఏదైనా ఒక పరిశ్రమలో నిర్ణీత వ్యవధిలో శిక్షణ పొందడమే అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే అదే సంస్థలో ఉద్యోగం పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రాక్టికల్ నైపుణ్యాలు నేర్పించడంలో కీలకంగా నిలుస్తోంది అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్. ఇప్పుడు ఔత్సాహికులకు అప్రెంటీస్ పరంగా అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
టెక్నికల్ కోర్సులకే పరిమితమైన అప్రెంటీస్ ఇప్పుడు అకౌంటింగ్, ట్యాక్సేషన్, హోటల్ మేనేజ్మెంట్.. ఇలా ప్రాక్టికల్ నైపుణ్యాలు అవసరమైన ప్రతి విభాగంలోనూ లభిస్తున్నాయి. ముఖ్యమైన అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ల వివరాలు..
డీజీఈటీ అప్రెంటీస్‌షిప్ స్కీం
ఇది జాతీయ స్థాయిలో కార్మికశాఖ అమలుచేస్తున్న పథకం. ఈ పథకం అప్రెంటీస్‌షిప్ యాక్ట్-1961 ప్రకారం డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లారుమెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో అమలవుతోంది.
ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలకు సంబంధించిన ప్రాక్టికల్ నైపుణ్యాలను అందుకోవచ్చు. ఐటీఐ, ఒకేషనల్ ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్, బీటెక్ ఉత్తీర్ణులు అప్రెంటీస్ ట్రైనింగ్‌కు అర్హులు.
అభ్యర్థుల అర్హతలు, ఎంపిక చేసుకున్న శిక్షణ ఆధారంగా ట్రైనింగ్ వ్యవధి ఉంటుంది. ఈ ట్రైనింగ్‌లో ప్రస్తుతం 259 ట్రేడ్లలో శిక్షణ లభిస్తోంది. బీటెక్, డిప్లొమా అభ్యర్థులకు 126 సబ్జెక్ట్‌లలో ఏడాది వ్యవధిలో ట్రైనింగ్ ఉంటుంది.
అప్రెంటీస్ ట్రైనింగ్ సమయంలో బీటెక్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4984 పైగా, డిప్లొమా, ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీలకు రూ.3542 పైగా ఒకేషనల్ అప్రెంటీస్ ట్రైనీలకు రూ.2758 పైగా స్టయిఫండ్ అందిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు డీజీఈటీ ఆధ్వర్యంలోని రీజనల్ డెరైక్టరేట్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
అభ్యర్థుల అర్హతల ఆధారంగా అప్పటికే తమ వద్ద నమోదు చేసుకున్న సంస్థల అవసరాలకు సరితూగే అభ్యర్థులను సదరు సంస్థల్లో అప్రెంటీస్ ట్రైనీలుగా తీసుకుంటారు.
పరిశ్రమల్లో నిర్ణీత వ్యవధిలో అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసి.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ నిర్వహించే ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే నేషనల్ అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ కూడా లభిస్తోంది.
వివరాలకు వెబ్సైట్: బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్
కేంద్ర మానవ వనరుల శాఖ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ కోసం 'బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్'ను రూపొందించింది. ఈ ప్రోగ్రామ్ పరిధిలో ఇంజనీరింగ్ / టెక్నాలజీలో 122 విభాగాల్లో అప్రెంటీస్ చేసే అవకాశముంది.
ఔత్సాహిక అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఖాళీలు ఉన్న సంస్థల్లో అవకాశం లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక, సర్టిఫికెట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అందిస్తారు. దేశవ్యాప్తంగా నాలుగు రీజనల్ సెంటర్ల ద్వారా బోర్డ్స్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ అమలవుతోంది.
దక్షిణభారత దేశానికి సంబంధించి చెన్నయిలోని బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ సెంటర్ ఈ ప్రోగ్రామ్ అమలును పర్యవేక్షిస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ స్కీం ద్వారా ట్రైనింగ్ పొందేందుకు ఉండాల్సిన అర్హతల వివరాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్, బీఫార్మసీ, బీఆర్క్, హోటల్ మేనేజ్మెంట్
టెక్నీషియన్ అప్రెంటీస్ : ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్లలో డిప్లొమా
టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటీస్: ఒకేషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత
వెబ్సైట్:
అనుభవం నైపుణ్యం.. అప్రెంటీస్‌షిప్
