ఎక్కడున్నావమ్మా నువ్వు
ఎప్పుడొచ్చావు
ఇంకా మా ఊరి చివరి గుడిసెలో
దీపం వెలిగించనే లేదు
పొద్దున్నే మా అమ్మ చేతి గాజుల మీద
పొయ్యింకా వెలగనే లేదు
పల్లెలు కుల శ్లేష్మంలో
ఈగల్లా జారిపడి
రక్తమోడుతూనే ఉన్నాయి
ఇంటికి చేరాల్సిన
బడికెళ్లే లేలేత మొగ్గలు
మార్గమధ్యంలోనే
మానవ మృగాల
కాలిగిట్టల కింద నలిగి
నెత్తురు కక్కుంటూ
ఉత్తరం దిక్కులో కలిసిపోతున్నాయి
పొట్ట చీల్చితే అక్షరం ముక్క సంగతేమోగానీ
అన్నం మెతుకు కూడా కనిపించని
చిన్నారుల ఆకలి చావులు
దేశ రాజధాని రోడ్ల మీద
నెత్తురు మరకలయి అంటుకుంటున్నాయి
నేలను పండించే మట్టి చేతులు
ఉరితాళ్లను ముద్దాడుతున్నాయి
మనిషి మనిషికీ మధ్య అంతరాలు
అగాథాల్లా తెరుచుకుని
మతాల పేర కులాల పేర
మానవ హననాలు పెట్రేగిపోతున్నాయి
ఎక్కడున్నావు నువ్వు
ఎప్పుడొచ్చావమ్మా నువ్వు!
నువ్వొచ్చిన చోట
జీవితం పక్షిలా ఎగరాలి కదా
ఆంక్షల వేట గాడి బాణం దెబ్బకు
స్వేచ్ఛరెక్కలు తెగి విలవిల్లాడుతుందేమిటి?
అక్షరాలు నేల కొరుగుతున్నాయి
పదాలు పగులుతున్నాయి
వాక్యాలు ముక్కలవుతున్నాయి
ప్రశ్నలు బహిష్కరించబడుతున్నాయి
కలలు చిదిమేయబడుతున్నాయి
బతుకు పై కప్పులు కూలిపోయి
నిరుపేదల జీవికలు
కకావికలమవుతున్నాయి
ఎక్కడున్నావమ్మా నువ్వు
ఎగిరే పక్షిలోనూ లేవు
కురిసే ఆకాశంలోనూ లేవు
నెర్రెలిచ్చిన నేలలోనూ లేవు
పేదవాడి పెదాల మీది తడిలోనూ లేవు
ఎక్కడున్నావు నువ్వు?
నువ్వొచ్చి కూడా
డెబ్బయ్యేళ్లు దాటే పోయిందంటున్నారు
ఎప్పుడొచ్చావమ్మా నువ్వు
ఎవరికీ కనిపించకుండా
ఎక్కడ తిష్ట వేసావు?
ఎక్కడున్నావు నువ్వు?
- చిత్తలూరి
82474 32521