నా ఎద్దుల వీపుల మీద
ప్రేమ ముద్రలు వేసి
అదిలించి అరక దున్నిన
ఆ మొరటు చేతులు
నా వరిపొలం మొరాల మీద
లేడి పిల్లలా గెంతిన ఆమె
లేత పాదాల పూల కాడలు
కలుపు తీసి నాటేసి
కుప్ప నూర్చి దుక్కి దున్ని
నేలను ఆకుపచ్చని అద్దం చేసిన
శ్రమ పుష్పాల పరిమళాలంటిన
ఆమె చెమట దేహం
ఆకలి గింజలెరుగని
ఓ ఆటల మైదానంలోని చిరుత
ఒక కలను కని ఆకాశంలోకి
పిట్టలా ఎగరేసింది
తన ఊరిలోని నీలినింగిని
చిన్న ముక్కగా కత్తిరించుకుని
తన నేల మీది బురద మట్టిని
పాదాలకు లేపనంగా పూసుకుని
ఊపిరి సిరిని ఉప్పెనలా ఎగదన్ని
అనేక దూరాలను కాలితో
అలవోకగా తన్నింది
ఆమె పాద స్పర్శకు పులకించిన
మట్టి నేల లేచి నిలబడి
ఆమె పరుగు పాదాలను
ప్రేమగా ముద్దాడింది
ప్రపంచ వేదిక మీద
నా పల్లె మొగ్గ
హిమ సుమంలా వెల్లి విరిసింది
నా దేశమంతా ఆ పరిమళాల్లో
తడిసి పులకిస్తూ
ఆమె చెమట చేతులను
బురద కాళ్లనూ ఆర్తిగా
ముద్దాడుతోంది!
(పరుగులో స్వర్ణం సాధించిన హిమాదాస్కి అభినందనలతో)
- చిత్తలూరి
91338 32246