సాహిత్యంలో కవిత్వానికి, అందులోనూ కవులకి, అందులోనూ కవయిత్రులకి ఇప్పుడు దక్కుతున్న ప్రాతినిధ్యం చూస్తే చాలా బాధ కలుగుతోంది. అకవిత్వానికి వేదికలపై ఊరేగింపులు జరుగుతున్నాయి. ప్రచార సాధనాలు ప్రకటనలకు, రాజకీయ కుమ్ములాటలకు ఇచ్చిన విలువ సాహిత్యానికి ఎప్పుడూ ఇవ్వవు. బండెడు అనాసక్తికరమైన ముఖ పుస్తక వేదికల మీద ఎక్కడో ఒకచోట మినుకుమనే మెరుపు కవితలు సొంత గోడలకు వేలాడుతున్నాయి. అన్నిటిని పోగేస్తే ఒక ఇంద్ర ధనుస్సు అవుతుందేమో? కవయిత్రుల సంఖ్య పెరుగుతున్నందుకు సంతోషించాలో లేక ఈ అసాహిత్య అనాదరణ వాతావరణానికి వారసులు అవుతున్నందుకు విచారించాలో తెలీడం లేదు. ఇంకోపక్క కనీసపు ఆసక్తి , అభినివేశం లేకుండా- 'మాకూ ఉంది లెండి దురద, మేమూ రాస్తాము లెండి కపిత్వం..' అని కొందరు ఒక గొప్ప ప్రక్రియని అవమానిస్తుంటే, మనకి కోపం కూడా రావడం లేదేమిటి? కోపానికి పూర్వ రూపం ప్రేమ కదా? మనకి కవిత్వం కవిత్వం మీద ఉండాల్సినంత ప్రేమ లేదా ? లేకపోతే వచనం వేరు, కవిత్వం వేరు అని ఎందుకని సాధికారికంగా ఎందుకు చెప్పలేకపోతున్నాం? క్రియా రూపంలో ఎందుకు నిరూపించలేకపోతున్నాం. ఈ ఆలోచన ఒక్కటే కవయిత్రుల సమ్మేళనానికి రూపం ఇచ్చింది. ఘనమైన పేర్లు, అజెండాలు, అధ్యక్ష పీఠాలూ వంటి పటాటోపాలు లేకుండా ఇద్దరు ముగ్గురు కవయిత్రులం కలిసి చర్చించుకుని, ఫేస్బుక్ వాల్లో పోస్ట్ చేశాం. స్పందన ఇచ్చిన వారితో బాటు ఇతర కవయిత్రులకు వాట్సప్ గ్రూప్ ద్వారా ఆహ్వానం పంపించాం. అంతే! వారంలోగానే కవయిత్రుల సమ్మేళనం జరిగిపోయింది.
ఇది ఒక చిన్న కదలిక. సంచలనం
కుల మత, ప్రాంతీయ బేధం లేకుండా కవిత్వం మాత్రమే తమ చిరునామాగా ఉన్న అందరూ పాల్గొనవచ్చు అనే మా విశాల దృక్పథం అందరికీ నచ్చింది. దాదాపు ఇరవై మంది దాకా తమ అంగీకారం తెలిపారు. ఎప్పుడో రాసిన పాత కవిత్వాలు చదువుకోవడం కాకుండా, ఒక సమకాలీన సమస్య గురించి ముందుగా నిర్ణయించుకున్న అంశం మీద మాత్రమే కవిత్వం రాయాలని తీర్మానించుకున్నాం. దానివల్ల ఆ సమస్య మీద ఆలోచన పెట్టడం, తెలుసుకోవడం, చదువుకోవడం, సమస్యని పరిశీలించడం లాంటి అనేక ప్రయోజనాలు ఏకకాలంలో జరుగుతాయి. తర్వాత నిరంతరం కవిత్వం రాయడం అనే ప్రక్రియకి అలవాటు పడతాం. ఈ కృషి వల్ల నిర్మాణపరంగా కవిత్వం చిక్కబడుతుంది.
విద్యార్థి ఆత్మహత్యలపై తొలి కవితా సమ్మేళనం
మొదటి కవితా సమ్మేళనంలో విద్యార్థుల ఆత్మహత్మలను అంశంగా తీసుకున్నాం. ఇది ఎంత క్లిష్టమైన సమస్యో చెప్పనవసరం లేదు. ఇందులో శీలా సుభద్ర- 'భద్రం చెల్లి'కవితలో జీవితాన్ని ఊరికొయ్య ఆక్రమించిన తీరు గురించి, దాన్నించి తప్పించుకోవాల్సిన మెలకువ గురించి హృద్యంగా రాశారు. కొండేపూడి నిర్మల- 'ఉయ్యాల వర్సెస్ ఉరితాడు' కవిత ఉయ్యాలను ఉరితాడుకి నడిపించిన వ్యవస్థ దుర్మార్గం గురించి చెప్పింది. ఏవరేజ్ కుర్రాడుగా పుట్టడమే నేరమా అని అడిగిన తల్లి వేదన కనిపిస్తుంది. రేణుకా అయోల - ఉరి వేసుకోకముందు కవితలో, చదువు గోడలు దగ్గరగా జరిగి ఇరుకైన వైనాన్ని గురించి రాశారు. స్వాతి శ్రీపాద, 'అమ్మకి విన్నపం' కవితలో బిడ్డ ఒక తల్లికి రాసిన ఉత్తరం చదివితే గుండె నీరవుతుంది. శాంతి ప్రబోధ - నేరం ఒక్కడి కాదు సుమా అనే కవితలో విద్యార్థుల ఆత్మహత్యలకు పెద్దలే కారణమని చెబుతూ వారి బాధ్యతను గుర్తు చేశారు. ఇంకా అనేకమంది ఈ కవి సమ్మేళనంలో అక్షరబద్ధం చేసిన ఆవేదన అందరి గుండెల్ని బరువెక్కించింది.సమస్యకు కారణాలు కూడా మాట్లాడుకున్నాం.
మూఢ నమ్మకాలు - దొంగ బాబాలపై రెండో సమ్మేళనం
మనం తల్చుకుంటే ప్రభుత్వాల్నే మార్చగలం. మరి దొంగ బాబాల్ని, మూఢ నమ్మకాల్ని తిప్పికొట్టలేమా? దొరికినవాడు దొంగ బాబా. దొరకనివాడు మంచివాడా? దొరికేదాకా పాదాభివందనాలు చేయాలా? అలాగే, మూఢ నమ్మకాలు అనగానే, చేతబడి, బాణామతి, చిల్లంగి, జంతుబలి, మానవబలి, జోగిని, మాతంగి - అని అందరూ చెబుతారు. కానీ శకునం, దిష్టి, చెడుచూపు, మంచిరోజు/ చెడ్డరోజు, హస్తవాసి, పాదం పెట్టిన వేళ, జాతకాలు, వాస్తులు, బల్లి, పిల్లి, బొద్దింక శాస్త్రాలు, గ్రహణ స్నానాలు గట్రా మంచివేనా?
ఒక మూఢ విశ్వాసం ఏ స్థాయివరకూ వ్యక్తిగతంగా ఉండి ఎక్కడనుంచి సామాజికం అవుతుంది? అని అడిగితే ఎవరి కొలబద్దలు వారికున్నాయి. వ్యక్తిగతమంతా రాజకీయమే అని వాదిస్తున్న చోట ఈ కోణంలో చర్చ జరగాల్సిందే! ఈ పరిస్థితిని ఒక కవయిత్రిగా మీరెలా సమీక్షిస్తారు? ఆడవాళ్ళుగా మనం అనేక నమ్మకాలకు బలయిపోతున్నాం. ఇప్పుడు అదనంగా మూఢనమ్మకాల్ని, బాబాల్ని నమ్మాలా? ఈసారి ఇదే మన కవితా వస్తువు. పదునైన కవిత్వం రాయండి.' అని పిలుపు ఇచ్చాం. నవంబరు నెల 11వ తేదీన కవి సమ్మేళనం జరిగింది. కవయిత్రులు తమదైన కోణంలో బలమైన కవిత్వం వినిపించారు. దూరాభారం వల్ల స్వయంగా పాల్గొనలేనివారు తమ కవితలు పంపి సమస్య పట్ల తమ సంఘీభావాన్ని తెలిపారు. కవిత్వానికి ముందు ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది.
స్త్రీలు ఎందువల్ల ఈ మూఢ నమ్మకాలకు, బాబాలకు లొంగిపోతున్నారు? అనే కోణంలో మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాల్ని ఒక జాబితా తయారు చేశాం. అది ఇలా ఉంది :
- అనేక కారణాల వల్ల స్త్రీలలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఒక వర్గంలో గృహహింస, సామాజిక హింస, భద్రత లేనితనం వల్ల జీవితం సంక్షోభమైపోయింది. దీనివల్ల ఎవరితో పంచుకోవాలో తెలియక ఎవరు ఏది చెబితే అది నమ్ముతున్నారు. ఈ పుట్టలో ఈ పాముందో అనుకుంటూ ఏదో ఒక బాబాని నమ్మడం వల్ల కష్టాలు తొలగిపోతాయని వస్తారు.
- డబ్బు, తీరిక ఉన్న ఇంకో వర్గం నలుగుర్ని కలవడానికి వేదిక లేక గుళ్ళు, బాబాల సందర్శనాలు ఎంచుకుంటారు. కొత్త చీరలు నగలు కొనుక్కోవడానికి అలంకరించుకోవడానికి ఈ వేదికలు పనికొస్తున్నాయి.
- భక్తి అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. ఎందుకంటే భక్తి పేరుతో చేసే పూజల్లో యాత్రల్లో స్టేటస్‌ని చూపించుకోవచ్చు. ఫ్రెండ్స్ దగ్గరికి వెడుతున్నాను అంటే అభ్యంతరపెడతారు. అదే పూజలూ, స్వామీజీలు అంటే ఏమి అనరు. ఇది పనిలోంచి ఒకరకమైన రిలాక్సేషన్ కూడా.
ా పెట్టుబడిదారులు, న్యూస్ చానల్స్ నిర్వహిస్తున్న పూజల్లో అయితే ఎక్కువమంది టీవీలో కనిపించడానికే చేస్తారు. ఏ రోజు ఏ రంగు చీర కట్టుకు రావాలో కూడా పూజలో చెబుతున్నారు. దీనివల్ల బట్టల షాపులకు గిరాకీ. పూజా సామగ్రి వాళ్ళే సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ రకంగా డబ్బు ఒక దోపిడి. ఒక నమ్మకంతో వెళ్ళినవాళ్ళకి పది రకాల నమ్మకాలు మూటకట్టుకుని వస్తున్నారు.
- అసలు ఆడవాళ్ళకి ఇవి కాక ఇంకేం ఉన్నాయో తెలీక కూడా చాలామంది వెడతారు.
- నిజంగా ఈ మూఢ నమ్మకాల వల్ల, బాబా వచనాల వల్ల ఎవరికైనా మేలు జరిగిందా అనే ప్రశ్న వేసుకున్నాం.
ా ఒక పూజ చెయ్యడం వల్ల అనుకున్న పని జరగకపోతే అది వినియోగదారుల చట్టం కింద కోర్టుకు ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. సోమరి పోతుల్లాంటి బాబాల్ని తరిమికొట్టి, రాజ్యమూ, చట్టమూ, నేరమూ, శిక్షా, హక్కులూ, బాధ్యతలు అనే పదాల్ని; వాటి సారాన్ని సామాన్య జనానికి గుర్తు చేయాలి అనిపించింది. ఈ విషయాల్ని రచనల ద్వారా, చర్చల ద్వారా వెలుగులోకి తేవాలని అనుకున్నాం. వస్తు తీవ్రతని బట్టి డిసెంబరులో కూడా దీనిమీద పెద్దఎత్తున సెమినార్ నిర్వహించాలని నిర్ణయించాం. న
- కొండేపూడి నిర్మల
9949303626