గ్రీన్హౌసులు ... ఆధునిక సేద్య కేంద్రాలు. మొక్కలకు వివిధ దశల్లో కావల్సిన వాతావరణాన్ని నిర్దేశించే ఉష్ణోగ్రత, కాంతి, ఆర్ధ్రతల నియంత్రణ కచ్చితమైన విధంగా సమకూర్చడానికి ఇవి బాగా దోహదపడతాయి. రక్షిత వాతవరణం (గ్రీన్ హౌస్)లో మొక్కల్ని పెంచినప్పుడు, వాటి చుట్టూ అనువుగా ఉండే సూక్ష్మ వాతావరణం ఏర్పడి, ఆరోగ్యరకంగా పెరుగుతాయి. వాతావరణాన్ని ఏమేరకు నియంత్రించే ఏర్పాట్లు ఉంటాయి అనే అంశం మీద ఆధారపడి, గ్రీన్‌హౌస్‌ల నాణ్యతను, ధరలను నిర్ణయిస్తారు. వీటిని ఎక్కువ ధర (పూర్తి నియంత్రణ), మధ్యస్థ ధర (పాక్షిక నియంత్రణ), తక్కువ ధర కలిగిన (నియంత్రణలేని) గ్రీన్ హౌస్‌లు అని మూడు తరగతులుగా వర్గీకరించవచ్చు. వీటి నిర్మాణం, యాజమాన్యం గురించి డాక్టర్ కృష్ణప్రియ ఇస్తున్న వివరాలను చూద్దాం.
ఎక్కువ ధర గ్రీన్ హౌసుల్లో ఎగుమతికి అనువైన పూలు, కూరగాయలు, మొక్కలను కోరిన నాణ్యతలో పెంచవచ్చు. అయితే మన దేశంలో ఉన్న వివిధ వాతావరణ పరిస్థితులకు తక్కువ ధర గ్రీన్‌హౌస్‌లు, మధ్యస్థ ధర గ్రీన్ హౌస్‌లు ఎంతో అనువుగా ఉంటాయి.
గ్రీన్హౌస్లో మొక్కలు పెంచడం వల్ల ప్రయోజనాలు:
గ్రీన్హౌస్లో ఉత్పాదకత ఎక్కువగా ఉండి, ఒక యూనిట్ విస్తీర్ణంలో దిగుబడి చాలా హెచ్చుగా ఉంటుంది.
గ్రీన్‌హౌసుల్లో పెంచిన పూలు చాలా ఎక్కువ నాణ్యత కలిగి మచ్చలు, దెబ్బలు లేకుండా విదేశాల ఎగుమతికి అనుకూలంగా ఉంటాయి.
గ్రీన్‌హౌసుల్లో పురుగులను, తెగుళ్ళను సులభంగా, సమర్థవంతంగా అరికట్టవచ్చు. సీజన్ కాని సమయంలోనూ గ్రీన్ హౌసుల్లో సాగు చేయవచ్చు.
అత్యంత విలువైన అలంకార మొక్కల్ని రక్షిత వాతావరణంలో సులభంగా పెంచగలిగే వీలుంటుంది.
ఏఏ పంటలు అరుకూలం? : గ్రీన్‌హౌసుల్లో తక్కువ పరిమాణంలో విలువైన అలంకార మొక్కల్ని, కట్ప్లవర్స్గా ఉపయోగపడే మొక్కలను సాగు చేయాలి. గులాబీ, జెర్బెరా, కార్నేషన్, ఆంథూరియం, ఆర్కిడ్లు గ్రీన్‌హౌసుల్లో సాగుకు అనుకూలంగా ఉండే ప్రధానమైన పంటలు.
ప్లానింగ్, డిజైన్ : గ్రీన్హౌస్ నిర్మాణం ఆయా ప్రదేశం, పంటలను బట్టి నిర్ధిష్టంగా ఉంటుంది. గ్రీన్హౌస్ నిర్మాణం తగినంత బలంగానే కాకుండా మొక్కల పెరుగుదలకు అవసరమైనంత సూర్యకాంతి ప్రసరించేదిగా కూడా ఉండాలి.
స్థలం ఎంపిక : మురుగు నీటిని సులభంగా తీసి వేయడానికి అనువుగా ఉండే విధంగా వాలు ఉండాలి. వర్షపు నీరు గ్రీన్‌హౌస్‌లోకి ప్రవహించకూడదు. గ్రీన్హౌస్లో సాగు చేయడానికి సమృద్ధిగా మంచి నాణ్యమైన నీరు కొరత లేకుండా, విద్యుత్తు సరఫరా కూడా ఉండాలి. గ్రీన్‌హౌస్‌లు సూర్యరశ్మికి అంతరాయం లేకుండా బిల్డింగులకు, వృక్షాలకు దూరంగా నిర్మించాలి.
నిర్మించాల్సిన దిశ : సింగిల్ స్పాన్ గ్రీన్హౌస్లను ఏ దిశలోనైనా నిర్మించవచ్చు. అయితే మల్టీస్పాన్ గ్రీన్హౌస్లను ఉత్తర, దక్షిణ దిశలో ఉండేలా నిర్మించాలి. దీనివల్ల గ్రీన్హౌస్లోని నిర్మాణపు భాగాల వల్ల నీడ నిరంతరం ఒకే ప్రదేశంలో పడకుండా ఉంటుంది.
వివిధ భాగాలు : తక్కువ ధర గ్రీన్హౌస్లో నిర్మాణపు ఫ్రేమ్, పైకప్పు మాత్రమే ఉంటాయి. అయితే మధ్యస్థ ధర గ్రీన్హౌస్లో వీటితో బాటు వాతావరణాన్ని నియంత్రించే పరికరాలు (గాడ్జెట్స్) కూడా ఉంటాయి. దీనివల్ల వీటి నిర్మాణపు ఖర్చు పెరుగుతుంది. గ్రీన్హౌస్లో ఫ్రేమ్ దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలు, పైకప్పు 3-6 సంవత్సరాలు, కంట్రోల్ లేదా మోనటరింగ్ పరికరాలు 5 నుంచి 10 సంవత్సరాలు, వినియోగించిన వస్తువు నాణ్యత, యాజమాన్యాన్ని బట్టి మన్నుతాయి.
నిర్మాణ రకాలు : సాధారణంగా గ్రీన్హౌస్ నిర్మాణంలో రెండు రకాలున్నాయి. మొదటి రకం సింగిల్ స్పాన్ గ్రీన్హౌస్. ఇది విడిగా ప్రత్యేకంగా ఉంటుంది. వీటిని స్యోన్సెట్, గోథిక్, గేబుల్ డోమ్ మొదలైన అనేక ఆకారాల్లో నిర్మిస్తారు. వీటిని 100 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించవచ్చు. మల్టీస్పాన్ లేక రిడ్డి అండ్ ఫర్రో లేక గట్టర్లతో అనుసంధానం చేసిన గ్రీన్‌హౌస్‌లు పెద్దవిగా ఉండి, ఒకే రకమైన వాతావరణాన్ని కోరుకునే పంటల్ని లాభసాటిగా సాగు చేయవచ్చు.
గ్రీన్‌హౌస్‌ల నిర్మాణం
ఫ్రేమ్‌ను ఫాబ్రికేట్ చేయటం : నిర్మాణం సైజు, మన్నికలను బట్టి ఖర్చును తగ్గంచటానికి మైల్డ్ స్టీలు లేదా గెల్వనైజ్డ్ ఐరన్ పైపులను (0.5 -1.5 అంగుళాల వ్యాసం గలవి) నిర్మాణం ఫ్రేమ్ కోసం వాడాలి. ఇవి అల్యూమినియం యాంగిల్స్ లేక పెద్ద కొలతలు గల పైపులు కంటే చౌకగా లభిస్తాయి. 100 చ.మీ. విస్తీర్ణంలో నిర్మించిన పాలిహౌస్ యూనిట్ మొక్కల పెరుగుదలకి, వాణిజ్య సరళిలో పూలసాగు చేపట్టడానికి కనీసం 300 నుంచి 500 విస్తీర్ణంలో నిర్మించిన పాలీహౌస్‌కు అనుకూలంగా ఉంటుంది. తక్కువ ధరలో నిర్మించే గ్రీన్హౌస్లో పెంచే మొక్కలకు కావలసిన ఉష్ణోగ్రతను వెంటిలేటర్లను ఏర్పరిచి, సహజసిద్ధంగా జరిగేలా ఏర్పాటు చేస్తారు. కాబట్టి నిర్మాణం మధ్య ఎత్తు కనీసం 3.5 మీటర్లు, 500 చ.మీ. ఉంటుంది. ఆపైన విస్తీర్ణమున్న గ్రీన్హౌస్లో కనీసం 5-7 మీటర్ల ఎత్తు మధ్యన ఉండేలా, నిర్మాణపు పైభాగాన వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలి.
పైకప్పు/ ఫ్రేమ్ క్లాడింగ్ : నిర్మాణం పైకప్పుగా 200 మైక్రాన్ల (800 గేజ్) మందం గల పాలియిథలిన్ ఫిల్మ్ లేదా అతినీలలోహిత కిరణాలను స్థిరీకరించే (యు.వి. స్టెబిలైజ్డ్) ఫిల్మ్‌ను గానీ వాడవచ్చు. వీటి ధర చదరపు మీటరుకు 25-30 రూపాయల వరకు ఉంటుంది. ఫైబర్ గ్లాస్ దాదాపు చ.మీ. 300-500 రూపాయల వరకూ ఉంటుంది.
వాతావరణాన్ని నియంత్రించే పద్ధతి : వివిధ పరికరాలు ఏర్పాటు లేకుండా సహజంగా ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి సరిపడినంత వెంటిలేషన్ (60-70 శాతం) కోసం నిర్మాణపు పక్కల 40-60 మెష్రాంబో నెట్టును అమర్చాలి. దీనిపై అవసరాన్ని బట్టి మూసి వేయడానికి అనువుగా, పైకి చుట్టడానికి అవకాశం ఉండేలా పాలిథిన్ ఫిల్మ్ కూడా ఏర్పాటు చేయాలి. మధ్యస్థర గ్రీన్‌హౌసుల్లో సహజసిద్ధంగా వెంటిలేషన్ బదులుగా ఎవపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. దీనికోసం సెల్పాడ్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించాలి.
గ్రీన్‌హౌస్‌ల యాజమాన్యం : గ్రీన్హౌస్లో ఉష్ణోగ్రతను సిఫార్సు చేసిన స్థాయిలో ఉండేలా నియంత్రించాలి. గ్రీన్హౌస్లోని గాలి ఉష్ణోగ్రతలు పంట తట్టుకోలేని స్థాయికి పెరిగినప్పుడు చల్లబర్చి తగ్గించాలి.
వెంటిలేషన్
సహజ వెంటిలేషన్ పద్ధతి : ఈ పద్ధతిలో గ్రీన్‌హౌస్‌లు తగినంత ఖాళీ ప్రదేశం ఉండేలా ఏర్పాటు చేయాలి. బయట వాతావరణంలోని గాలి లోపలికి ప్రవేశించి, గ్రీన్‌హౌసుల్లో ఉన్న గాలి సమాన పరిమాణంలో బయటికి నెట్టబడేలా చేయాలి. గ్రీన్హౌస్లోని గాలి సహజంగా లోపలి గాలి, బయటి గాలికి గల ఉష్ణోగ్రతల తేడాల వల్ల బయటికి నెట్టబడుతుంది. గాలి కదలిక కూడా దీనికి దోహదపడుతుంది. సహజంగా వెంటిలేషన్ జరగడానికి 20-50 శాతం ఫ్లోర్ ఏరియా రంధ్రాలు నిర్మాణంలో ఉండాలి.
కృత్రిమ (ఫోర్స్డ్) వెంటిలేషన్ : ఈ పద్ధతిలో గ్రీన్హౌస్లోని గాలి కదలికను పవర్ ద్వారా చేస్తారు. దీనికోసం ఫ్యాను, లోవర్స్, వెంట్స్ ఉంటాయి. లోవర్స్ మనుషుల ద్వారా లేదా మోటార్ల ద్వారా పనిచేస్తాయి. మోటార్ల ద్వారా పనిచేసే రోవర్లు అనుకోకుండా పెనుగాలులు వీచే సమయంలో గ్రీన్హౌస్ నిర్మాణాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడతాయి.
ఎగ్జాస్ట్ వెంటిలేషన్ : ఈ సిస్టమ్‌లో ఇన్లెట్లు ఎక్కువ ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైన విషయం. సింగిల్ స్పాన్ గ్రీన్హౌస్లో గాలి ప్రయాణపు దూరం 30 మీటర్లు, మల్టి-బే హౌస్‌లో 60 మీటర్ల వరకు ఉండాలి. ఫ్యాన్లకు ఒకవైపు చివర బిగించి, ఇన్లెట్లను మరో వైపు చివర అమర్చాలి.
రూఫ్ షేడింగ్ : గ్రీన్హౌసులో ప్రసరించే సూర్యకాంతి శక్తిని గ్లేజింగ్పై అపారదర్శక పదార్థాలను వాడిగానీ, గ్లేజింగ్పై కర్ర లేదా అల్యూమినియం లాథ్ అమర్చి గానీ, తగ్గించవచ్చు. దీనికోసం వాణిజ్యపరంగా తయారుచేసిన షేడింగ్ కాంపౌండ్ లేదా రంగులతో తయారుచేసిన మిశ్రమ పదార్థాలను ఉపయోగించవచ్చు.
1.0 కిలో వైట్ లెడ్, జింక్, టీలానియం పైంట్, 1.0 కిలో వెటెనింగ్, 4 1/2 స్పూన్ల లిన్సీడ్ ఆయిల్, 8 లీటర్ల గాసోలిన్ లేదా పెయింట్స్ నాఫా (అగ్నిప్రమాదాన్ని అరికట్టడానికి).
2.25 కె.జి. వైట్లెడ్, 4 టీస్పూన్ల లిన్సీడ్ ఆయిల్, 7.5 లీటర్ల గాసోలిన్ లేదా పెయింటర్స్ నాష్ట్రా.
తెల్లని కాంపౌండ్స్ ఎక్కువ సూర్యకాంతిని పరావర్తనం చేస్తాయి (83 శాతం). ఆకుపచ్చ రంగు 43 శాతం, నీలం, ఊదా రంగులు 25 శాతం సూర్యకాంతిని మాత్రమే పరావర్తనం చెందేలా చేస్తాయి. కాబట్టి తెలుపు రంగును ఎక్కువగా వాడతారు.
లాడ్ షేడ్స్ : షేడింగ్ కాంపౌండ్ల కంటే కర్ర లేదా అల్యూమినియంతో చేసినవి అనువుగా ఉంటాయి. కానీ ధర ఎక్కువగా ఉంటుంది. షేడింగ్ కాంపౌండ్లు లాథ్ల కంటే కొంచెం తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. షేడింగ్ కాంపౌండ్లు సౌరశక్తిని చాలా వరకు పరావర్తనం చేసినప్పటికీ, కొంత ఇవి వాహకాలుగా పనిచేసి, కొంతభాగం గ్రహిస్తాయి. పేడింగ్ గ్లాస్ కంటే లాథ్ కవర్లు ఎక్కువ చల్లదనాన్ని ఇస్తాయి.
ఎవాపొరేటివ్ కూలింగ్ ఫ్యాను, పాడ్ సిస్టమ్ : ఫ్యాన్, పాడ్ కూలింగ్ సిస్టమ్‌లో పెద్ద ఫ్యాన్లు, ఎప్పుడూ తడిగా ఉండే కచ్ఛితమైన సైజులో బిగించిన పాడ్ ఉంటాయి. ఇవి రెండింటిని గ్రీన్హౌస్ ప్లానింగ్ ప్రకారం సరైన చోట అమర్చుతారు. ఫ్యాను గ్రీన్హౌస్లోని గాలిని బయటకు పంపిస్తుంది. దీనివల్ల గ్రీన్హౌస్లో కొద్దిగా శూన్యం లేక వ్యతిరేక పీడనం ఏర్పడుతుంది. కొద్దిగా ఏర్పడిన శూన్యం ఫ్యాన్లకు అభిముఖంగా మరో అంచున బిగించిన పాడ్ నుండి లోపలికి గాలిని లాగుతుంది. దీనివల్ల చల్లని గాలి లోపలికి మృదువుగా ప్రవేశించి, మొక్కలు పెరుగుతున్న ప్రదేశంపై కదులుతూ వేడిని గ్రహిస్తుంది. ఈ వేడిగాలి ఫ్యాన్ల ద్వారా తిరిగి బయటకు లాగబడుతుంది. హీట్ సిస్టమ్‌కు తగినంత ఫ్లో స్థలం ఉండాలి. దీనివల్ల ఉష్ణాన్ని గ్రహించడానికి తగిన పరిమాణంలో ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. పాడ్‌లో తడిచే పీచు పదార్థం, ప్రత్యేకమైన సెల్యులోజ్‌తో అరలు కలిగి ఉండేలా తయారు చేయబడి ఉంటుంది. నీటిలో తడుపుతూ దీనిని ఎప్పుడూ తడిగా ఉంచాలి. నీటిని తిరిగి పంపిణీ చేయాలి. ఇది గ్రీన్హౌస్లో ప్రవేశించే గాలిని చల్లబర్చుతుంది.
ఫ్యాన్, పాడ్ పద్ధతుల్లో కొంత శూన్యం ఏర్పడుతుంది. కనుక గ్రీన్‌హౌస్‌ను గాలి చొరబడకుండా ఉండేలా నిర్మించాలి. తగిన విధంగా మరమ్మతులు చేయాలి. తలుపులను, తెరిచిన ప్రదేశాలను మూసివేసి, బయటి నుంచి వేడిగాలి లోపలికి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. లోపలికి పాడ్ ద్వారా ప్రవేశించిన గాలి, వేడిని గ్రహించి వెచ్చబడుతుంది. గాలి ప్రసరణ పెంచి, గాలి లేదా కాంతి తీవ్రతను తగ్గించి, వేడిని తగ్గించవచ్చు.
నీరు కట్టుట, పోషణ : గ్రీన్హౌస్లో పెంచే పంటకు నీటి అవసరం బయటి వాతావరణంలో పెరిగే పంట కంటే తక్కువగా ఉంటుంది. డ్రిప్ పద్ధతి లేదా మైక్రో స్ప్రింక్లర్ల ద్వారా గ్రీన్హౌస్లో నీరు పెట్టాలి. దీనివల్ల నీరు బాగా ఆదా అవడమే కాకుండా, పంటకు వివిధ దశల్లో అవసరమైనంత తేమ ఉండేలా నీరు పెట్టి పంట పెరుగుదల దిగుబడి, నాణ్యతలని పెంచవచ్చు.
గ్రీన్హౌస్లో పూర్తిగా లేదా పాక్షికంగా వాతావరణాన్ని నియంత్రిస్తాం. కనుక మొక్కలు అత్యధిక ఉత్పాదక శక్తి కలిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. కాబట్టి ఫెర్టిగేషన్ ద్వారా పంటను బట్టి, తగిన పరిమాణంలో సమతుల పోషకాలను ఇవ్వాలి. ఫెర్టిగేషన్ పద్దతిలో ఎరువులు ఆదా అవడమే కాకుండా కూలీ (లేబరు) ఖర్చు తగ్గుతుంది. ఈ పద్ధతిలో వాడే ఎరువులు నీటిలో పూర్తిగా కరిగిపోవాలి. వెంచురీ ద్వారా లేదా ఫెర్టిలైజర్ పంపు ద్వారా గానీ సిస్టమ్‌లోకి పంపాలి. గ్రీన్హౌస్లోని పంటకు మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల వీటి చుట్టూ ఉన్న సూక్ష్మ వాతావరణం పురుగులు, శిలీంధ్రాలు ఒక సారి లోపల ప్రవేశిస్తూ, త్వరగా అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీటి ప్రవేశానికి ఆస్కారం లేకుండా నిర్మూలనకు అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డాక్టర్ ఎన్. కృష్ణప్రియ, సైంటిస్ట్
డాక్టర్ ఎస్.ఎం.ఎం.మునీంద్ర నాయుడు,
ప్రోగ్రాం కో ఆర్డినేటర్
కృషి విజ్ఞానకేంద్రం, నెల్లూరు
గ్రీన్ హౌస్ నిర్మాణం-యాజమాన్యం
