వర్షాధార మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రధానమైన సమస్య నీటి లభ్యత. వర్షాల అనిశ్చితి వల్ల సకాలంలో అవసరమైనప్పుడు తగినంత వర్షం లేకపోవడం, అవసరంలేని సమయాల్లో విపరీతమైన వర్షాలు పడటం, వర్షపు దినాలు తగ్గిపోవడం, వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజులు వ్యవధి రావడం మొదలైన సమస్యల వల్ల వర్షాధారిత వ్యవసాయంలో ఇటీవల కాలంలో విపరీతమైన ఒడుదుడుకులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి శాస్త్రవేత్తల సలహాలతో ప్రభుత్వం వర్షపు నీటి కుంటలను ప్రతి రైతు పొలంలో తవ్వించుకునే వీలును కల్పిస్తున్నారు. రైతులు వర్షాధార ప్రాంతాలలో ఈ నీటి కుంటలపై సమగ్ర అవగాహన కల్గి, వాటి యాజమాన్యం, వినియోగంలో సరైన మెలకువలు పాటించగలిగితే ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసి పట్టి మెట్ట పంటలకు అమృత భాండంగా వినియోగించొచ్చు.. మంచి దిగుబడులు సాధించవచ్చు.
పొలంలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నప్పుడు పోగైన వర్షపు నీటిని వాలు ఆధారంగా ఏ వైపుకు చేరుతుందో గమనించాలి. అక్కడ పొలానికి చివరగా, మూలన ఆ వర్షపు నీటినంతటినీ సేకరించి, నిల్వ చేసుకునేందుకు వీలైనంత ఘనపరిమాణంలో గుంటను తవ్వాలి. ఈ గుంటలో నిల్వ చేసిన నీటిని పైరుకు అవసరమైనప్పుడు వివిధ రకాలుగా వాడుకునే వీలును కల్పించుకోవడాన్ని నీటి కుంటలు అంటారు.
నీటి కుంటల వినియోగం
వ్యవసాయంలో నీటి కుంటలను రెండు రకాలుగా వినియోగిచుకోవచ్చు. ఒకటి ఇంకుడు గుంతలు. ఇవి వ్యవసాయ పొలంలో ఉన్న బోరు బావి, ఊటబావులలో నీరు సమృద్ధిగా ఊరటానికి వినియోగిస్తారు. రెండు సేద్యపు నీటి కుంటలు. ఇవి నీటిని నీటి కుంటల్లో ఎక్కువ కాలం నిల్వ ఉంచి అవసరమైనప్పుడు పైర్లకు జీవతడులను అందిస్తాయి.
వ్యవసాయ పొలం చిన్నదిగా ఉంటే ఒకటి లేదా రెండు నీటి కుంటలు అవసరాన్ని బట్టి, లేదా వ్యవసాయ పొలం కమతా పెద్దదిగా, పొడవుగా ఉంటే వాలు ఆధారంగా, వాలు వెంబడి ఒకటి కంటే ఎక్కువగా నీరు రావడానికి వీలుగా, గుంటలలో అమరికను ఏర్పాటు చేసుకునీ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు. వర్షపాతాన్ని బట్టి సేద్యపు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడం, కుంటల ఘనపరిమాణం ఆధారపడి ఉంటుంది. సాలీనా 500 మి.మీ. లేదా ఆ పైన వర్షపాతం ఉంటే 250 ఘ.మీ. నీటి పరిమాణం ఉండే విధంగా, 500 నుంచి 750 మి.మీ. వర్షపాతం ఉంటే 250 ఘ.మీ. నుంచి 500 ఘ.మీ. నీటిని నిల్వ చేసుకునే విధంగా, 750 మి.మీ. కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంటే 500 ఘ.మీ. నీటిని నిల్వ చేసుకునే సేద్యపు నీటి కుంటలను తవ్వుకోవాలి. తేలిక పొలాలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి నీటి కుంటలకు లైనింగ్ తప్పనిసరి. నలుపు రంగు ఉన్న బరువు పొలాలలో లైనింగ్ అవసరం లేకపోవచ్చు. ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో నీటి కుంటలను నదీ పరివాహక ప్రాంతానికి నీటి వనరు అందే ప్రాంతాల్లో తవ్వితే వరదలు నివారించబడి, రిజర్వాయర్లలో మట్టి పూడిక తగ్గి, నీరు సముద్రంలో కలిసి వృథా అవ్వకుండా సక్రమంగా వినియోగ పడుతుంది. సేద్యపు నీటి కుంటల్లోకి వచ్చే నీటిని బట్టి, నీటి కుంటలను తవ్వే ప్రాంతాలను బట్టి వాటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి: తవ్విన నీటి గుంటలు, నేల మీద నీటిని నిల్వచేసే గుంటలు, సహజ ఊటల గుంటలు, పరివాహక ప్రాంతపు పక్కన ఏర్పాటు చేసుకునే నీటి గుంటలు.
నీటి గుంటల ఏర్పాటు
పొలంలో నేల స్వభావాన్ని, వాలును, వైశాల్యాన్ని, వరదను, నేలలో నీరు ఇంకే స్వభావాన్ని, వర్షపాతాన్ని బట్టి ఆయా ప్రాంతాలలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి. వాలు పొలంలో ఎడమవైపు ఉంటే, ఎడమ మూలలో కుంట ఏర్పాటు చేయాలి. వాలు పొలంలో కుడివైపు మూలకు ఉంటే, కుడి మూలలో ఏర్పాటు చేయాలి. వాలు పొలం చివరలో కిందకు ఉంటే, ఏదో ఒక మూలలో ఏర్పాటు చేసుకోవచ్చు. వాలు వివిధ రకాలుగా ఉంటే, నీరు ఏ ప్రాంతానికి చేరుతుందో అక్కడ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవాలి.
నేల మీద నీటి నిల్వ : సహజంగా పొలంలో ఉన్న లోతట్టు ప్రాంతానికి వచ్చే వరద నీటిని చిన్నపాటి గట్ల ద్వారా నిల్వ చేసుకోవాలి. వీటికి నీరు రావడానికి కాల్వలు పెద్దగా అవసరం లేదు. నీరు ఎక్కువైనప్పుడు బయటకు పంపటానికి కావాల్సిన నిర్మాణాలు చేపట్టాలి. పొలంలో ఎత్తు పల్లాలు ఎక్కువగా ఉంటే ఇలాంటివి సాధ్యపడతాయి.
సహజ ఊటల నీటి గుంటలు : పొలంలో ఎత్తు ప్రాంతాలలో అనగా గుట్టలకు ఆనుకుని ఉన్న భూమి బాగా తడిసినప్పుడు భూమి లోపలిపొరల్లో వాలు ఆధారంగా ఎక్కువకాలం నీరు నీటి కుంటలలోకి వచ్చే విధంగా పొలంలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవచ్చు.
పరీవాహక ప్రాంతపు పక్కన : కాలువలు/నదీ పరివాహక ప్రాంతాల పక్కన ఏర్పాటు చేసుకునే నీటి కుంటలలోకి నది నుంచి కాలువల ద్వారా లేదా పైపుల ద్వారా నీటిని సేకరించి, నిల్వ చేసుకోవచ్చు.
నేలల స్వభావం/ నీటి కుంటలు తవ్వడానికి అనుకూలమైన నేలలు : నీటి కుంటలు ఏర్పాటుకు ఆయా నేలల్లో నీరు ఇంకే స్వభావం, నేలలో నీరు పక్కలకెళ్లే స్వభావం తక్కువగా ఉండాలి. ఈ నేలల్లోని కుంటల్లో నీరు ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది. నేల లోతు ఒక మీటరు కన్నా అధికంగా ఉండి ఉదజని సూచిక, లవణ గాఢత తక్కువగా ఉన్న భూగర్భ జలాలు కలిగిన నేలల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. నీటి కుంటల్లో నీరు ఎక్కువ మోతాదులో చేరుతుంటే నేలలోని మట్టి కణాలూ నీళ్ల ద్వారా కుంటలో చేరి పూడిక సమస్య వస్తుంది. కనుక సరియైన నేల, నీటి సంరక్షణ యాజమాన్య పద్ధతులైన వాలు గట్లు, బోదెలు, కాలువలు మొ.వి నీరు లభించే ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవడం మంచిది.
నీటి కుంట ఆకారం/ పరిమాణం : బరువు నేలల్లో 20 శాతం, తేలిక నేలల్లో 10 శాతం వర్షపు నీరు వరదలాగా మారి వృథా అవుతుంది. కనుక నీటికుంట పరిమాణం ఆయా వ్యవసాయ భూమికి 50 మి.మీ. సామర్థ్యం కలిగిన కనీసం ఒకటి లేదా రెండు జీవతడులను అందించాలి. ఉష్ణోగ్రతను బట్టి నీటి ఆవిరి, నేలలో నీరు ఇంకడం, పక్కకు పోవడం, పూడిక మొదలైనవి నీటికుంట సామర్ధ్యంలో 5-10 శాతాన్ని నష్టపరుస్తాయి. కనుక పంటకు కావలసిన నీటి పరిమాణంతో పాటు నష్టాన్నీ కలుపుకుని మొత్తం ఘనపరిమాణానికి కుంటలు నిర్మించుకోవాలి. నీటి కుంటలను ప్లాస్టిక్ షీట్ (అగ్రి ఫిల్మ్) తో లైనింగ్ చేయడం వల్ల 100 శాతం నీరు ఇంకిపోకుండా కాపాడుకోవచ్చు.
- డాక్టర్ ఎం.రాజశ్రీ
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్
డా. కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం
గరికపాడు, కృష్ణా జిల్లా - 521175