గన్ ప్రాణాలు తీస్తుంది. రెయిన్ గన్ పంటకు ప్రాణం పోస్తుంది. ఈ ఏడాది కర్నూలు జిల్లా ఆదోని మండలం తంగరడోణలో రెయిన్ గన్ ద్వారా జల్లులు కురిపించి ఎండుతున్న పంటలను కాపాడిన తీరు చర్చనీయాంశమైంది. కర్నూలు, కల్లూరు మండలాల్లో ప్రయోగాత్మకగా చేపట్టిన ఈ ఈ కార్యక్రమం ద్వారా వంద ఎకరాల్లో పంటలను కాపాడినట్లు ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ దేవమునిరెడ్డి ప్రజాశక్తికి తెలిపారు. నీటి లభ్యత, పంటకు ఎంత తడి అవసరమనేది ఆధారం చేసుకొని రెయిన్ గన్ సామర్థ్యం ఎంతనేది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. 5హెచ్‌పి, 7.5హెచ్‌పి, 10 హెచ్‌పి మోనొ బ్లాక్ మోటర్లతో ఈ గన్ను వాడతారు. 5హెచ్‌పి మోటర్తో 75 అడుగుల దూరం వరకు జల్లులు పంపితే, 7.5 హెచ్‌పి మోటార్‌తో 90 అడుగుల దూరం రేడియస్‌తో పంటను తడపొచ్చు. చెరువులు, రిజర్వాయర్లు, కాల్వలు, నదులు, పెద్ద బావులు మాత్రమే అనుకూలం. పంట కుంటలలో నీరు నిల్వ ఉన్నా రెయిన్‌గన్‌ను వినియోగించవచ్చు. వంద నుంచి 300 మీటర్ల దూరం నుంచి నీటితో పంటలను తడపవచ్చు. పొలంలో 20 మీటర్ల నుంచి 150 మీటర్ల వ్యాసార్థం వరకు రెయిన్ గన్లు నీటిని వర్షం తరహాలో చల్లుతాయి. గంటకు అర ఎకరా నుంచి ఎకరా వరకు పంటలను తడుపుతాయి. గంటకు ఆరు నుంచి 24 వేల లీటర్ల వరకు పొలంలో వర్షం మాదిరి నీటి జల్లులను వెదజల్లుతుంది. యూనిట్ విలువ రూ.28 వేల వరకు అవుతుంది. దీంట్లో ఒక రెయిన్ గన్, 25 పైపుల సెట్టు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎపిఎంఐపి ద్వారా రాయితీపై వీటిని సమకూర్చడానికి కసరత్తు చేస్తోంది.- ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
ప్రాణం పోసే రెయిన్ గన్
